Reading Time: 2 minutes
Secret Soldier Censor Troubles China Piece Title Change Nihal Surya

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సెన్సార్ బోర్డునే షేక్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమాలకు సెన్సార్ కట్స్ పడటం కామన్. కానీ ఏకంగా ఒక సినిమా కోసం రివ్యూ కమిటీలు, ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs) రంగంలోకి దిగాయంటే ఆ కంటెంట్ ఎంత సెన్సేషనలో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అసలు టైటిల్ ‘చైనా పీస్’. ఈ టైటిల్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డ్.. ఏకంగా 8 నెలల పాటు సినిమాను హోల్డ్‌లో పెట్టింది. చివరకు ‘చైనా పీస్’ అనే పేరును తీసేయాలని కండిషన్ పెట్టడంతో, ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చి ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. టైటిల్ మార్చినా డైరెక్టర్ రాసుకున్న అసలు కథను, ఉద్దేశాన్ని మాత్రం ఏమాత్రం తగ్గించకుండా క్వాలిటీ విజువల్స్‌తో మూవీని రెడీ చేశారు. నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకు, దేశ భద్రతకు సంబంధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అయిన సంఘటనకు ఎలాంటి లింక్ ఉందనేదే ఈ స్పై డ్రామా అసలు కథ. గూఢచారులు అంటే హాలీవుడ్ లెవల్లో కాకుండా.. మన పక్కనే ఉంటూ, మనలో ఒకరిలా కలిసిపోయే రియలిస్టిక్ యాక్షన్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోలు నిహాల్, సూర్య శ్రీనివాస్ సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులకు స్పెషల్ షో వేశాం. ఇండస్ట్రీలో సినిమా చూసిన పెద్దలు.. ‘ఇది పెద్ద స్టార్ హీరోలు చేయాల్సిన సబ్జెక్ట్’ అని మెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది” అని హీరోలు చెప్పారు. స్నేహం, దేశభక్తి అనే రెండు పవర్‌ఫుల్ ఎమోషన్స్ చుట్టూ నడిచే ఈ కథ, ఆడియన్స్‌కు కచ్చితంగా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి సీనియర్లు కీలక పాత్రలు పోషించారు. వీఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా కుదిరిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరోల భవిష్యత్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. నిహాల్ ఈటీవీ కోసం ఒక సినిమా, అలాగే సాయిరాజేష్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తుండగా.. సూర్య శ్రీనివాస్ ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే బైలింగ్వల్ ప్రాజెక్ట్‌తో పాటు మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు.