Reading Time: 2 minutes

కంటిచూపు లేని వారి కోసం.. ముందున్న వస్తువులను గుర్తించే డివైజ్ వచ్చేసింది

Caption of Image.

కంటిచూపులేని వారికి గుడ్ న్యూస్.. దృష్టి లోపం ఉన్నవారు సాధారణంగా చేతికర్ర ,గైడ్ డాగ్ సాయంతో ముందుకు సాగడం మనం చూస్తుంటాం. అయితే ఇకపై చేతికర్ర గానీ, గైడ్ డాగ్ గానీ, ఎవరి సాయం లేకుండా ముందుకు వెళ్లేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో  ఓ పరికరం రెడీ అయింది. త్వరలో అందుబాటులోకి రానుంది. 

రోజ్ హల్మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన  విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, రోజువారీ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2026 డిజైన్ ప్రాజెక్టులను రూపొందించారు. ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ  ఇన్ స్టిట్యూట్ కు చెందిన ఐదుగురు విద్యార్థుల టీం దృష్టి లోపం ఉన్న వారికి తమ చేతికర్ర లేదా గైడ్ డాగ్ గుర్తించలేని అడ్డంకులను కూడా గుర్తించడంలో సహాయపడే ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. దీనిని ఒకసారి ఛార్జింగ్ తో 12-గంటల పాటు పనిచేస్తుంది. 

ఈథన్ పావెల్, అనికా కావో, జాడా హంటర్-హేస్, అనుజ్ సువర్ణ ,రైలీ ఎప్పర్సన్ అనే ఐదుగురు విద్యార్థులు ఈ డివైజ్ ను డెవలప్ చేశారు.అదే ఇనిస్టిట్యూట్ కు చెందిన  మ్యాథ్స్   పూర్వ విద్యార్థి జాన్ మారుమ్‌తో కలిసి ఈ డివైజ్ ను తయారు చేశారు.

దృష్టిలోపం ఉన్నవారికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో డివైజ్  వచ్చేస్తోంది. Time- of -Flight (ToF) సెన్సార్లతో పనిచేసే ఈ పరికరం ముందున్న వస్తువులు, అడ్డంకులు ఎంత దూరంలో ఉన్నాయో గుర్తించే  కంటిచూపు లేని వారిని ముందుకు నడిపిస్తాయి. 

ToF సెన్సార్లు కాంతి లేదా ఇన్‌ఫ్రారెడ్ సిగ్నల్‌ను ముందుకు పంపి.. అది వస్తువును తాకి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని లెక్కిస్తాయి. దీని ఆధారంగా వస్తువు ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తాయి. ఈ సమాచారాన్ని స్మార్ట్ కేన్‌లు, స్మార్ట్ గ్లాసెస్, ధరించగలిగే పరికరాల్లో ఉపయోగించి అడ్డంకులు ఎదురైనప్పుడు వైబ్రేషన్, బీప్ లేదా వాయిస్ అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తాయి.

ముఖ్యంగా రోడ్లపై నడిచేటప్పుడు గోడలు, వెహికల్స్, చెట్లు, ఇతర వస్తువులను ముందుగానే గుర్తించడంలో ఈ టెక్నాలజీ సహాయపడే అవకాశం ఉంది. తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లోనూ ToF సెన్సార్లు ఉపయోగపడటం మరో ప్రయోజనం.

అయితే ఇవి దృష్టిని పూర్తిగా భర్తీ చేసే టెక్నాలజీ కాదు. నావిగేషన్‌లో అదనపు సహాయక సాధనంగా ఉపయోగించడం ద్వారా దృష్టిలోపం ఉన్నవారు చేతికర్ర, వాచ్ డాగ్ లేకుండా ప్రయాణం, భద్రతను మెరుగుపరిచే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.