Reading Time: < 1 minute
Duleep Trophy 2026 Final East Zone Clinch Title After Draw With South Zone

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్ జోన్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నిబంధనల ప్రకారం.. ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ జోన్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఐదవ రోజులో మొత్తంగా 7 వికెట్ల నష్టానికి 388 రన్స్ చేసింది. ఖురైషీ 116 పరుగులతో, షమీ 0తో అజేయంగా నిలిచారు. చివరి రోజు ఆటలో రెండు వికెట్స్ కోల్పోయిన ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ముగించింది. సౌత్ జోన్‌కు మ్యాచ్‌ను గెలిచే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల మధ్య పోరు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యమే ఈస్ట్ జోన్‌కు టైటిల్‌ను అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌ 336 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

ఈ విజయంతో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ నేతృత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో డ్యాన్స్‌ చేస్తూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా.. సౌత్‌ జోన్‌ 336 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈస్ట్ జోన్‌కు ఫాలో ఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఈస్ట్ జోన్ 388/7 పరుగులు చేసింది.