Reading Time: 2 minutes

Sardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్‌ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే!

Caption of Image.

తమిళ స్టార్ హీరో కార్తి, విలక్షణ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సర్దార్ 2’ (Sardar 2), ఇవాళ (సెప్టెంబర్ 10, 2026) తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తి మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించగా.. SJ సూర్య కీలక పాత్ర పోషించగా, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది.

తొలి భాగంలో నీటి ప్రైవేటీకరణ, నీటి సంక్షోభం వంటి సామాజిక అంశాలను కథలో భాగంగా చూపించిన పీఎస్ మిత్రన్.. ఈసారి ఎలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? సర్దార్‌గా కార్తీ మరోసారి ఆకట్టుకున్నాడా? ఎస్‌జే సూర్య విలనిజం ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ స్థాయి ఇంపాక్ట్‌ను సీక్వెల్ అందుకుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘సర్దార్ 2’పై ఆడియన్స్ టాక్ ఎలా ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే?

‘సర్దార్ 2’ కథను డైరెక్టర్ పీఎస్ మిత్రన్.. ఒకేసారి గతం, ప్రసెంట్ కాలం మధ్య నడిపించాడు. తొలి భాగంలో పరిచయమైన రా ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్.. గతంలో చేపట్టిన ఓ కీలక మిషన్‌ను ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తూ కథ మొదలవుతుంది. దేశం కోసం పనిచేసే క్రమంలో సర్దార్ ఎదుర్కొన్న ప్రమాదాలు, అతని మిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం, ఆ ఆపరేషన్‌కు సంబంధించిన పరిణామాలు కథకు బలమైన నేపథ్యంగా నిలుస్తాయి. ఈ కథనే సినిమాకు ప్రీక్వెల్ ఎలిమెంట్‌గా దర్శకుడు ఎంచుకున్నాడు.

మరోవైపు ప్రసెంట్ టైంలో సర్దార్ కుమారుడు ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తన తండ్రి గతంతో ముడిపడిన ఓ మిషన్‌లోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలో దేశానికి పెను ముప్పుగా మారే బ్లాక్ డ్యాగర్ (SJ సూర్య) అనే శక్తివంతమైన ప్రత్యర్థి రంగంలోకి వస్తాడు. సర్దార్ గతంలో మొదలైన సమస్యకు, విజయ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రమాదానికి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి పూర్తి చేయాల్సిన మిషన్ ప్రభావం కొడుకు జీవితంపై ఎలా పడింది? అనేదే కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఇలా ‘సర్దార్ 2’ ఒక సాధారణ సీక్వెల్‌లా కాకుండా.. సర్దార్ ఆరిజిన్ స్టోరీని, విజయ్ ప్రస్తుత పోరాటాన్ని కలిపిన ప్రీక్వెల్-సీక్వెల్‌గా సాగుతుంది. కథను ఎక్కడా ఇతర కమర్షియల్ ట్రాక్‌లకు ఎక్కువగా మళ్లించకుండా మిషన్‌పైనే ఫోకస్ చేయడం సినిమాకు ప్లస్‌గా నిలిచిందని సోషల్ మీడియాలో రివ్యూలు చెబుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్‌లో స్టోరీని నేరుగా ప్రధాన మిషన్‌లోకి తీసుకెళ్లడం, సర్దార్ గతాన్ని పరిచయం చేయడం, విజయ్ ఎదుర్కొనే సమస్యకు బేస్ వేయడం జరుగుతుంది. కార్తీ ద్విపాత్రాభినయం, యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఆడియన్స్ సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే కొన్ని చోట్ల యాక్షన్ మరీ అతిగా అనిపించిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. 

సెకండ్ హాఫ్‌లో ఏం జరుగుతుంది?

సెకండాఫ్‌లో సర్దార్ గత మిషన్‌కు, ప్రస్తుత కాలంలో విజయ్ ఎదుర్కొంటున్న బ్లాక్ డ్యాగర్ ముప్పుకు ఉన్న లింక్ మరింత స్పష్టమవుతుంది. తండ్రి మొదలుపెట్టిన పోరాటాన్ని కొడుకు ఎలా ముందుకు తీసుకెళ్లాడు? బ్లాక్ డ్యాగర్ అసలు లక్ష్యం ఏంటి? అతడి ప్లాన్‌ను విజయ్ ఎలా అడ్డుకున్నాడు? అనే అంశాల చుట్టూ క్లైమాక్స్‌ వరకు కథ నడుస్తుంది.

అయితే, ఫస్ట్ హాఫ్‌లో తీసుకొచ్చిన ఆసక్తిని సెకండాఫ్ పూర్తిగా కొనసాగించలేకపోయిందని మరి కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కథలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ నమ్మశక్యంగా అనిపించలేదని, ఓ సీరియస్ స్పై మిషన్‌లో ఉండాల్సిన టెన్షన్‌ను తీసుకురాలేకపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. 

మొత్తంగా.. ‘సర్దార్ 2’లో సర్దార్ గతం, విజయ్ వర్తమానం, బ్లాక్ డ్యాగర్ కుట్ర.. ఈ మూడు అంశాలను కలిపి ఓ భారీ స్పై మిషన్‌గా కథను మలిచారు. కార్తీ పెర్ఫార్మెన్స్, యాక్షన్, ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకున్నప్పటికీ.. కథనం, లాజిక్, సెకండాఫ్ విషయంలో మాత్రం ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ వస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.