
Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలపై, ఆయిల్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో హౌతీలు భీకరదాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్, టర్కీలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిటనట్లు భావించాలి. కానీ హౌతీలు సౌదీపై దాడి చేస్తుంటే పాకిస్తాన్, టర్కీలు పెద్దగా రియాక్ట్ కాకకపోవడం గమనార్హం.
సౌదీపై దాడి జరిగితే మక్కా రక్షణ ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ హౌతీల స్థావరాలపై దాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, చివరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, హౌతీలపై ఎలాంటి చర్యలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. దీనిని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు సౌదీని పాక్, టర్కీలు రక్షించలేవనేది స్పష్టమైంది. సౌదీ అరేబియాపై దాడులు పెరిగి, తమ ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లితే, మూడు దేశాల మధ్య ఉన్న మక్కా రక్షణ ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావచ్చని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెబుతున్నారు.
పాకిస్తాన్ వెనక్కి తగ్గడానికి ఇరాన్ అంశం కీలకంగా ఉంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తుంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాక్ చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో హౌతీలపై దాడి చేస్తే ఇది ఇరాన్‌తో దౌత్య సంబంధాలపై ప్రభావం చూపిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకే సౌదీ అరేబియాపై హౌతీల దాడులను నియంత్రించాలని పాకిస్థాన్ ఇరాన్‌ను కోరినప్పటికీ, హౌతీలపై తమకు పూర్తి నియంత్రణ లేదని టెహ్రాన్ చెబుతోంది.
ఇదిలా ఉంటే యెమెన్ పశ్చిమ ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో హౌతీలు ఉన్నారు. కీలకమైన ఎర్ర సముద్రంలోని ఓడరేవు మోఖా దగ్గరగా హౌతీలు వచ్చినట్లు తెలుస్తోంది. మోఖాపై నియంత్రణ సాధిస్తే బాబ్ అల్-మాండెబ్ జలసంధిపై వీరి ప్రభావం మరింత పెరుగుతుంది. దీంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం మరోసారి ఇబ్బందిగా మారుతుంది.