Reading Time: 2 minutes
Brics 2026 %e0%b0%92%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf %e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8a%e0%b0%95%e0%b0%b0%e0%b0%82 %e0%b0%b8

BRICS 2026: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం భారత్‌కు చేరుకుంటున్న తరుణంలో, బీజింగ్ నుంచి ఓ కీలక సందేశం వెలువడింది. మనం మంచి పొరుగు దేశాలుగా మెలుగుతూ, ఒకరి విజయంలో మరొకరం సహకరించుకునే భాగస్వాములుగా ముందడుగు వేద్దామని చైనా ఆకాంక్షించింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో కాలు మోపుతుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైనా రాయబారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుసగా మూడో ఏట వీరిద్దరూ ముఖాముఖి సమావేశమవుతుండటం విశేషం. గతంలో రష్యాలోని కజాన్, చైనాలోని తియాంజిన్‌లలో వీరి కలయిక జరిగింది.

ఉభయ దేశాల అగ్రనేతల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చైనా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక బంధాన్ని కేవలం తక్షణ ప్రయోజనాల కోణంలోనే కాకుండా, సుదీర్ఘ, వ్యూహాత్మక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీజింగ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడిని పెంచుకోవడం, కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ప్రధానంగా ఉన్న భేదాభిప్రాయాలను చొరవతో సరిగ్గా నిర్వహించడం ద్వారా సంబంధాలలో స్థిరత్వాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకుంది. సరిహద్దు వివాదాల కారణంగా గత కొన్ని ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ అవి ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి అడ్డంకి కాకూడదనే స్పష్టమైన సంకేతాన్ని చైనా ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక, వ్యూహాత్మక శక్తులైన భారత్, చైనాల బంధం ప్రాంతీయ స్థిరత్వానికి అత్యంత కీలకం. అందుకే మోడీ-జిన్‌పింగ్ భేటీపై ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లు పడ్డాయి. వీరి సమావేశంలో సరిహద్దు ప్రశాంతతతో పాటు ద్వైపాక్షిక వ్యాపారం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. చైనా వ్యక్తపరిచిన ఈ సానుకూల వైఖరి రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు పునాది వేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా మంచి పొరుగువారిగా ఉంటామని చెబుతున్నప్పటికీ, ఈ మాటలు కార్యరూపం దాలుస్తాయా లేదా అనేది వారు క్షేత్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వమే బంధానికి మూలస్తంభమని భారత్ స్పష్టం చేస్తున్న వేళ, ఈ అగ్రనేతల భేటీ పాత విభేదాలకు ముగింపు పలికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందో లేదో వేచి చూడాలి.