Reading Time: < 1 minute
Sbi Loans %e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ac%e0%b1%80%e0%b0%90 %e0%b0%96%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%b6%e0%b1%81%e0%b0%ad

భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా వ్యాపారుల లోన్ అర్హతను యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా అంచనా వేస్తారు. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తివారీ ఈ వివరాలను వెల్లడించారు. జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారులు, దుకాణదారులు, చిరు వ్యాపారులకు ఈ విధానం ద్వారా రుణాలు పొందడం సులభం అవుతుంది. చిన్న వ్యాపారాలలో క్రమం తప్పకుండా అమ్మకాలు జరిగి, ఆ పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారా డిజిటల్ రూపంలో జరుగుతుంటే, ఆ లావాదేవీలను వ్యాపార విక్రయాలకు నిదర్శనంగా బ్యాంక్ పరిగణిస్తుంది.

ప్రస్తుతం జీఎస్టీ రిజిస్టర్డ్ వ్యాపారులకు ఎస్బీఐ కేవలం 10 నిమిషాల్లోనే రుణాలు ఇస్తోంది. గడిచిన 18 నెలల్లో జీఎస్టీ, పాన్ డేటా ఆధారంగా లక్ష కోట్ల రూపాయల లోన్లను బ్యాంక్ మంజూరు చేసింది. అయితే జీఎస్టీ నంబర్ లేని చిన్న వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ఎస్బీఐ ఈ సరికొత్త యూపీఐ ఆధారిత పరిష్కారాన్ని రూపొందిస్తోంది.

యూపీఐ చెల్లింపుల విషయంలో ఎవరికి డబ్బు వెళుతుందనే పూర్తి స్పష్టత కొన్నిసార్లు రుణదాతైన బ్యాంకుకు ఉండదు. కానీ రిసీవర్ బ్యాంక్, థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల వద్ద ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. కస్టమర్ అనుమతితో యూపీఐ చెల్లింపులు, టెలికాం కంపెనీల నుంచి లభించే ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణం ఇచ్చే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ మోడల్ ద్వారా ఎస్బీఐ చిన్న వ్యాపారుల లోన్ సమస్యలను తీర్చాలని చూస్తోంది. ఈ కొత్త విధానం విజయవంతమైతే.. ఎలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని చిన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం సులభంగా బ్యాంక్ లోన్లు పొందే అవకాశం లభిస్తుంది. క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీల రికార్డు ఉన్న ప్రతి చిన్న వ్యాపారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.