
పెన్నా బేసిన్లో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్లలో ఇప్పటికే వంద టీఎంసీలకుపైగా నీటిని ఏపీ నిల్వ చేసుకున్నది. అయినా తాగునీటి పేరుతో శ్రీశైలం జలాలను మరో 40 టీఎంసీలకు వరకు తరలించుకుపోయింది. ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రీమెంబర్ కమిటీ మీ రెండు సార్లు టింగ్ నిర్వహించింది. ఆ రెండు మీటింగ్లూ ఎటూ తేలకుండానే ముగిశాయి. దీంతో మీటింగ్‌లతో ఒరిగేది ఏమీ ఉండదన్న దురుద్దేశంతోనే నదిని మలుపుకునేందుకు ఏపీ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
మామూలుగా పోతిరెడ్డిపాడు అంటేనే అదొక చిన్నపాటి నదీ వ్యవస్థ అనేది కాదనలేని సత్యం. ప్రస్తుతం గేట్ డ్యామేజ్ కావడంతో పోతిరెడ్డిపాడు నుంచి ప్రవాహాలు మరింత ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు గేట్ల ద్వారా రోజూ 8 వేల క్యూసెక్కుల నీళ్లను మళ్లిస్తున్న పొరుగు రాష్ట్రం.. ఈ గేట్ డ్యామేజ్ ద్వారా మరింత నీటిని మలుపుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. తెగిపోయిన రోప్‌కు రిపేర్లు చేసేందుకు కూడా పది నుంచి 15 రోజుల వరకు సమయం పడుతుందని ఏపీ అధికారులు చెబుతున్నారు.
150 మీటర్ల రోప్ అవసరమవుతుందంటున్నారు. అంటే ఈ పది పదిహేను రోజుల్లో మరో 10 నుంచి 15 టీఎంసీల వరకు నీళ్లు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో ఏపీ తొందరగా రిపేర్లు చేస్తుందన్న నమ్మకం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇదే జరిగితే ఏపీ రిజర్వాయర్లలోకి శ్రీశైలం నీళ్లన్నీ వెళ్లిపోతాయి. మనం తాగునీటికీ తల్లడిల్లాల్సిన పరిస్థితి ఉంటుంది.
నెల రోజుల్లో 60 టీఎంసీలు ఖాళీ..
శ్రీశైలం ప్రాజెక్టులో గత నెల 12 నాటికి 185 టీఎంసీల నిల్వ ఉండేది. కానీ, తాజాగా నీటి నిల్వ 123 టీఎంసీలకు పడిపోయింది. అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 60 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో ఖాళీ అయ్యాయి. అందులో ఏపీ వాటానే దాదాపు 40 టీఎంసీలు కావడం గమనార్హం. మనం విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు తీసుకుపోయిన నీళ్లలోనూ ఏపీ తన వంతు కబ్జా పెట్టేయడం ఆలోచించాల్సిన విషయం.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగానూ 865 అడుగుల వద్ద నీళ్లున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి 854 అడుగుల వరకు నీటిని తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గేట్ డ్రామాతో ఆ స్థాయికి వచ్చే వరకు నీటిన మళ్లించాలనే కుట్రలకు ఏపీ తెరలేపిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.