Reading Time: 2 minutes

మామూలు కీళ్ల నొప్పులు లేదా నీరసమే కదా అని చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తగినంత విశ్రాంతి తీసుకున్నా తీవ్రమైన అలసట అనిపించడం, ముఖంపై విచిత్రమైన దద్దుర్లు రావడం వెనుక ‘లూపస్’ (Lupus) అనే ప్రమాదకరమైన ఆటోఇమ్యూన్ వ్యాధి దాగి ఉండవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ముందస్తు సంకేతాలు ఏంటి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అసలు ఏంటి ఈ లూపస్ వ్యాధి?: మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్రిములు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడాలి. కానీ ఇది దారితప్పి మన స్వంత కణాలు, అవయవాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే ఆటోఇమ్యూన్ సమస్యే ఈ లూపస్. దీనివల్ల కీళ్ళు, చర్మం, మూత్రపిండాలు మరియు గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Lupus Symptoms in Women: Don’t Ignore Joint Pain, Tiredness and Skin Rashes
Lupus Symptoms in Women: Don’t Ignore Joint Pain, Tiredness and Skin Rashes

సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు: లూపస్ వ్యాధికి అత్యంత ముఖ్యమైన, స్పష్టమైన సంకేతం ముఖంపై వచ్చే దద్దుర్లు ముక్కు భాగం మరియు రెండు బుగ్గలపై సీతాకోకచిలుక రెక్కల ఆకారంలో ఎర్రటి మచ్చలు లేదా రాష్ వస్తుంది. ఇక ముఖ్యంగా ఎండలోకి లేదా సూర్యకాంతిలోకి వెళ్లినప్పుడు ఈ చర్మ సమస్య మరింత ఎక్కువవుతుంది.

తీవ్రమైన కీళ్ల నొప్పులు & అలసట: చేతులు, మణికట్టు, మోకాళ్ల కీళ్లలో విపరీతమైన నొప్పులు మరియు వాపులు రావడం దీని మరో లక్షణం. ఇక ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే కీళ్లు బిగుతుగా అనిపిస్తాయి. దీనికి తోడు రోజంతా ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన నీరసం, జ్వరం, జుట్టు రాలడం మరియు నోటిలో తరచూ పుండ్లు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి.

ఇక లూపస్ అనేది ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా అదుపులో ఉంచుకోగలిగే సమస్య. కాబట్టి శరీరంలో వచ్చే ఇలాంటి మార్పులను సాధారణ అలసట అని భావించి నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి సరైన అవగాహనతో వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎవరికైనా ఇలాంటి తీవ్రమైన కీళ్ల నొప్పులు, ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఉంటే వెంటనే ఒక రుమటాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను కలిసి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

The post మహిళలూ జాగ్రత్త..! కీళ్ల నొప్పులు, అలసట, ముఖంపై దద్దుర్లు లూపస్ లక్షణాలు కావచ్చు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.