
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలాగే మరో 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అవసరమైన దవాఖానల్లో అదనంగా 485 వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 9 ఎంఆర్ఐ, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఎంఆర్ఐ సేవలు అందుతున్నాయని చెప్పారు.
3 టెస్లా ఎంఆర్ఐ యంత్రాలు
నిజామాబాద్ జీజీహెచ్, సిద్ధిపేట జీజీహెచ్, సూర్యాపేట జీజీహెచ్, నల్గొండ జీజీహెచ్, మహబూబ్‌నగర్ జీజీహెచ్, నీలోఫర్ తదితర హాస్పిటల్స్‌లో కొత్తగా ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో రోగుల తాకిడి పెరిగిందని, ఈ నేపథ్యంలో అక్కడ అదనపు ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 9 అత్యాధునిక 3 టెస్లా ఎంఆర్ఐ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
8 దవాఖానల్లో సీటీ స్కాన్లు
ప్రస్తుతం 50 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా మరో 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.. అవసరమైన హాస్పిటల్స్‌లో మరో 485 వెంటిలేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పరికరాలపై నిరంతర నిఘా
వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతోనే సరిపెట్టకుండా అవి నిరంతరం పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. పరికరాల కొనుగోలు, సరఫరా, నిర్వహణ వివరాలను పర్యవేక్షించేందుకు ‘ఈ-ఉపకరణ్’ అనే వెబ్ ఆధారిత పరికరాల జాబితా, నిర్వహణ వ్యవస్థను వినియోగిస్తున్నామని తెలిపారు. టీజీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేసి పరికరాల పనితీరు, వర్కింగ్ కండిషన్, నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
1,500 మందికి పైగా టెక్నీషియన్లు
వైద్య పరికరాలు నిరంతరం పనిచేయాలంటే నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు అవసరమని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో గత రెండున్నరేళ్లలో 1,500 మందికి పైగా టెక్నీషియన్లను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించినట్లు చెప్పారు. అవసరమైన చోట కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలోనూ టెక్నీషియన్లను నియమిస్తున్నామని తెలిపారు.