
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో వంశీకి రూ.10 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ఆస్తి ఉందని కొడాలి నాని బహిరంగంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాని బయటపెట్టిన ఈ లెక్కలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే ఈ ఆస్తులన్నీ వంశీ రాజకీయాల్లోకి రాకముందే అంటే 90ల్లోనే సంపాదించాడని నాని సమర్థించే ప్రయత్నం చేయడం విశేషం. ఆ తర్వాత వంశీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా చక్రం తిప్పడంతో పాటు, పలు ప్రముఖ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో ఆయన సంపాదన కేవలం రూ.10 వేల కోట్లతో ఆగిపోదని, వాస్తవానికి వంశీ ఆస్తుల విలువ దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ఉంటుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికల్లో ECకి సమర్పించిన అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు కేవలం రూ.69.32 కోట్లేనని చూపించిన వంశీ.. ఈ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎక్కడ దాచారు? అఫిడవిట్‌లో చూపని ఈ రూ.40 వేల కోట్ల అక్రమ లాకర్ అసలు ఎవరి పేర్ల మీద ఉంది? నాని చేసిన ఈ ప్రకటనలు ఇప్పుడు వంశీ బినామీ ఆస్తుల బాగోతాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తున్నాయి.
ఈ భారీ ఆస్తుల గుట్టు ఇప్పుడు స్వయంగా వారి నోటనే బయటపడటం గమనార్హం. చట్టబద్ధంగా చూపించిన ఆస్తులకు, బహిరంగంగా తేలిన వేల కోట్ల సంపదకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసంపై ఐటీ, ఈడీ అధికారులు వెంటనే దృష్టి సారించాలనే డిమాండ్లు గట్టిగా వ్యక్తమవుతున్నాయి