Reading Time: < 1 minute

పరిశ్రమలను బెదిరిస్తే చూస్తూ కూర్చోం: మంత్రి శ్రీధర్ బాబు

Caption of Image.

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పరిశ్రమలను ఎవరైనా బెదిరిస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎక్కడికీ వెళ్లడం లేదని, పరిశ్రమల తరలింపుపై బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి ప్రధానమైన ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా  ఉందన్నారు. నగర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోందన్నారు.

పరిశ్రమల కోసం అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలతో పాటు కొత్త పెట్టుబడిదారులు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల చర్యలేనని వివరించారు.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పరిశ్రమలకు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో తాము సహకరించామని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు కీలకమని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

ALSO READ : ఫ్యాన్ వార్‌కు ఫుల్‌స్టాప్.. 34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో అజిత్, విజయ్..!

పరిశ్రమల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంపై తప్పుడు ప్రచారాలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

©️ VIL Media Pvt Ltd.