Reading Time: 2 minutes
Adilabad Joint User Airfield Airport Project Telangana

వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) ప్రాజెక్టు పురోగతిపై న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మిషన్ మోడ్‌లో పనులు.. నోడల్ ఆఫీసర్ల నియామకం

ఈ విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వారంలోగా ఒక్కో నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. దీనికి తోడు జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) , మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

దేశ రక్షణకు, రీజనల్ కనెక్టివిటీకి పెద్దపీట

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పౌర విమానయాన మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు, దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆదిలాబాద్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతమని కిషన్ రెడ్డి తెలిపారు. రీజనల్ కనెక్టివిటీ అవసరాన్ని రక్షణ మంత్రికి వివరించగా, ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి రక్షణ మంత్రిత్వ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

అదనంగా 1,500 ఎకరాల భూసేకరణ

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రక్షణ, పౌర విమానయాన అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించి 2.75 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణం అవసరమని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం భారత వైమానిక దళం (IAF) వద్ద ఉన్న 369.45 ఎకరాల భూమికి అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించనుంది. ఇక్కడ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్, ఆపరేషనల్ కాంప్లెక్స్, ట్రైనింగ్ , మెయింటేనెన్స్ సదుపాయాలను సిద్ధం చేయనున్నారు.

పౌర సేవలు, ఎంఆర్ఓ సదుపాయాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆధునిక సివిల్ టెర్మినల్‌తో పాటు ‘మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్’ (MRO) ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు అక్కడ విధుల్లో ఉండే ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి అవసరమైన నివాస, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఏళ్లుగా చేస్తున్న నిరంతర ప్రయత్నాలు ఇవాళ తుది దశకు చేరుకోవడం సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.