
“ఆ బిల్డింగ్‌లోకి అమ్మాయి అడుగు పెడితే.. బతికి బయటకు రాదు!” ఇప్పుడు ఈ ఒక్క డైలాగ్ చాలు.. ‘418’ సినిమాపై క్యూరియాసిటీ పెంచడానికి. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, డెబ్యూ డైరెక్టర్ కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్‌కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సాధారణ దెయ్యం కథకు పూర్తిగా భిన్నమైన ఓ డార్క్ అండ్ ఇంటెన్స్ హారర్‌ను చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.
15 ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఓ బిల్డింగ్‌ను తిరిగి తెరవడంతో అసలు భయానక కథ మొదలవుతుంది. అక్కడ ఉన్న రూమ్ నంబర్ 418 చుట్టూ ఏదో తెలియని శక్తి తిరుగుతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఒక్కొక్కటిగా ఉత్కంఠ పెంచుతున్నాయి. ముఖ్యంగా.. “దెయ్యాల కంటే మన ఊహే ప్రమాదకరం” అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జే. ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ట్రైలర్‌లో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు గోరీ విజువల్స్, డిస్టర్బింగ్ షాట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చివరి నిమిషంలో వచ్చే విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాల తరహాలో కనిపించే ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా ట్రైలర్‌కు ప్రత్యేకమైన టచ్ ఇచ్చింది.
అయితే ఇప్పటికే గర్భిణీలు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు సినిమాకు దూరంగా ఉండాలని మేకర్స్ హెచ్చరించారు. ఈ సెప్టెంబర్18న థియేటర్లలోకి రాబోతున్న ‘418’ మూవీ.. నిజంగానే ప్రేక్షకులను భయపెట్టగలదా? తెలియాలంటే థియేటర్ వరకు వెళ్లాల్సిందే!