
హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 14 సోమవారం నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని TGSRTC వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. గణేష్ ఉత్సవాలకు వచ్చే భక్తులు ఈ రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు.
జేబీఎస్ నుంచి బాలాపూర్‌కు ప్రత్యేక రూట్
జేబీఎస్ నుంచి బయలుదేరే ప్రత్యేక బస్సులు ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్‌బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జేబీఎస్ నుంచి ఉదయం 6:00 గంటలకు తొలి ప్రత్యేక బస్సు ప్రారంభమవుతుంది. రాత్రి 9:55 గంటల వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి. ప్రతి 40 నుంచి 50 నిమిషాల వ్యవధిలో బస్సులను నడపనున్నట్లు TGSRTC యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బాలాపూర్ గణేష్ మండపం నుంచి తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:55 గంటలకు తొలి రిటర్న్ సర్వీస్ ప్రారంభమై రాత్రి 11:50 గంటల వరకు బస్సులు నడుస్తాయి.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. భారీగా తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. గణేష్ ఉత్సవాలకు వెళ్లే భక్తులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా TGSRTC ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.