Reading Time: < 1 minute

కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు : ఎంపీ మల్లు రవి

Caption of Image.
  • కేటీఆర్‌‌పై పోలీసులకు మల్లు రవి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం బేగంబజార్ పోలీస్టేషన్ లో ఎంపీ మల్లు రవి ఫిర్యాదు చేశారు. సీఎం స్థాయి వ్యక్తిపై రాజకీయ విమర్శల పరిధి దాటి వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్  చేశారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే హరీశ్ రావు తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల్లో కొందరు స్పీకర్‌‌ను, ఇంకొందరు సీఎంను విమర్శిస్తున్నారని, మరికొందరు మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్​ఎస్​ లీడర్లపై మరో కేసు.. 

 సైఫాబాద్  అసెంబ్లీ  వద్ద  జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేతలపై సైఫాబాద్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడ్డారంటూ మహిళా కానిస్టేబుల్‌ కె.పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న మహిళా పోలీసులను ఉద్దేశించి కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించడంతో పలువురు మహిళా పోలీసులు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.