Reading Time: 2 minutes
Otr Ntv Telugu Telagana Congress Political News 4

OTR: మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటారా? లేక రాజీనామా చేసి వేరేదారి చూసుకుంటారా? పోస్ట్‌ ఊస్టింగ్‌ తర్వాత సైలెంట్‌గా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన ఫార్టీ ఇయర్స్‌ హస్తం వీరవిధేయుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన సైలెంట్‌ మోడ్‌ వెనకున్న స్కెచ్‌ ఏంటి? కొడుకు భవిష్యత్‌కు హామీ దొరికితే పక్క చూపు చూస్తారన్న ప్రచారంలో నిజమెంత? అసలు చిన్నారెడ్డి గురించి వనపర్తి విశ్లేషణలేంటి? వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నియోజకవర్గం గోపాల్‌పేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారెడ్డి… సొంత పార్టీకే చెందిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిని గట్టిగా టార్గెట్‌ చేశారు. అదే ఊపులో కాంగ్రెస్‌ అధిష్ఠానం డబ్బులకు టిక్కెట్లు ఇచ్చిందని, అవసరమైతే పార్టీలోనే ఉంటూ జీవన్‌రెడ్డిలా తిరగబడతానంటూ హాటు ఘాటు కామెంట్స్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి సీరియస్‌గా తీసుకుని… గాంధీభవన్‌ మీదుగా ఏఐసీసీ దాకా వెళ్ళారు. ఇక కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం కూడా వేగంగా స్పందించి చర్యలకు సిఫారసు చేయడంతో వేటు పడింది.

ఇక పదవి నుంచి తప్పించారన్న ప్రకటన రాగానే తన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు చిన్నారెడ్డి. కానీ… అటు పార్టీ పెద్దలపై కాని, ఇటు ప్రభుత్వ పెద్దల మీదగానీ…ఎక్కడ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదాయన. కానీ… తన అనుచరుల దగ్గర మాత్రం… నాకు పదవి మీద షోకు లేదని, అది ఉన్నా, లేకున్నా చిన్నారెడ్డికి గౌరవం ఉందని, ఆ గౌరవంతోనే నమ్ముకున్న వారికి పనులు అవుతాయని అన్నారట. నాకు ప్లానింగ్ కమిషన్ పదవిని టిల్ ఫరదర్‌ ఆర్డర్స్ అంటూ ఇచ్చిన సంగతి గుర్తు చేసినట్టు మాట్లాడుకుంటున్నారు. పదవి ఉన్నప్పుడే ప్రోటోకాల్ సదుపాయాన్ని వదులుకున్నానంటూ చెప్పుకొచ్చినట్టు తెలిసింది. ఆ ఎపిసోడ్‌ తర్వాత ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారాయన. ఆ సంగతి ఎలా ఉన్నా…ఒక పాయింట్‌ మీద రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా డౌట్‌ కొడుతోందట. చిన్నారెడ్డిని ప్రభుత్వ పదవి నుంచి తప్పించినా… పార్టీ పరంగా ఏఐసీసీ సెక్రెటరీ పోస్ట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితిలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతారా? లేక టాటా..బైబై అంటారా అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

అయితే… ఆయన పార్టీకి విధేయుడు, 48 ఏళ్ళుగా కాంగ్రెస్‌ లైన్‌ దాటని గాంధీ కుటుంబ సన్నిహితుడని, అలాంటి నాయకుడు మారే ప్రసక్తే లేదంటున్నారు సన్నిహితులు. వనపర్తిలో పార్టీని నిలబెట్టిందే ఆయన అంటూ… పక్క చూపులు ఉండబోవని చెబుతోంది మాజీ మంత్రి శిబిరం. కానీ… బయటి లెక్కలు మాత్రం వేరుగా వినిపిస్తున్నాయి. మారిన పొలిటికల్ ఇక్వేషన్స్‌తో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి బలోపేతం కావడం, కాంగ్రెస్‌లో జరిగిన అవమానాల కారణంగా చిన్నారెడ్డి మారిపోవడం ఖాయమనే అభిప్రాయం వనపర్తి పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇస్తే…. ఆయన బీఆర్ఎస్‌లో చేరతారని, ఆ ఉద్దేశ్యంతోనే… మరో జీవన్ రెడ్డి అవుతానంటూ కామెంట్ చేసి ఉండవచ్చని కొందరు విశ్లేశిస్తున్నారు.

దీనికి తోడు చిన్నారెడ్డి సోషల్ మీడియా పేజీల్లో పెట్టే వివిధ పోస్టులు కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా తన ఒక్కడి ఫోటోతో ఉన్నవే పెడుతున్నారు. ఇక ఇదే సమయంలో…సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న చిన్నారెడ్డికి ఎక్కడ పొరపొచ్చాలు వచ్చాయి? అసలు గ్యాప్‌నకు కారణమేంటంటూ వెతికే పనిలో సీరియస్‌గా ఉన్నారు కొందరు. చిన్నారెడ్డి తనకు రాజ్యసభ సీటు అడిగి భంగపడ్డారని కొందరు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదనను సియం రేవంత్ రెడ్డి తోసిపుచ్చినందుకేనని మరికొందరు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఘాటు వ్యాఖ్యలు చేసి వేటుకు గురయ్యారంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ వీడకపోవచ్చని సన్నిహితులు చెబుతుండగా… మారే వాతావరణమే కనిపిస్తోందన్నది పొలిటికల్‌ అనాలసిస్‌. దీంతో…. భవిష్యత్‌ కార్యాచరణపై ఉత్కంఠ పెరుగుతోంది.