Reading Time: 2 minutes
Ampere Overtakes Ola Electric In Indias Ev Two Wheeler Market

EV Two-Wheeler Sales: డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలకు గుడ్‌ బై చెబుతూ.. క్రమంగా ఈవీ వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు.. విక్రయాల్లోనూ ఈవీ కార్లు, ద్విచక్ర వాహనాలు సత్తా చాటుతున్నాయి.. ఇదే, సమయంలో ఈవీలో రోజుకో మోడల్‌ మార్కెట్‌లోకి వస్తుంది.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి తొమ్మిది రోజుల ప్రాథమిక అమ్మకాల గణాంకాలు ఈవీ మార్కెట్‌లో ఆసక్తికరమైన మార్పును చూపిస్తున్నాయి. గత కొంతకాలంగా టాప్-5లో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్‌ను గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ బ్రాండ్ వెనక్కి నెట్టింది.

ఓలాను అధిగమించిన ఆంపియర్
సెప్టెంబర్ తొలి తొమ్మిది రోజుల్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం 2,645 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రిజిస్టర్ చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 4.6 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ 2,607 యూనిట్లను విక్రయించి 4.5 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. దీంతో కేవలం 38 యూనిట్ల తేడాతో ఆంపియర్, ఓలా ఎలక్ట్రిక్‌ను అధిగమించి టాప్-5లోకి ప్రవేశించింది. అయితే ఈ గణాంకాలు సెప్టెంబర్ తొలి తొమ్మిది రోజులకు మాత్రమే సంబంధించిన ప్రాథమిక డేటా కావడం గమనార్హం.

ఆంపియర్ అమ్మకాల్లో భారీ వృద్ధి
ఆగస్టు తొలి తొమ్మిది రోజులతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఆంపియర్ అమ్మకాలు 66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఇదే తొమ్మిది రోజుల వ్యవధిలో 1,597 యూనిట్లు విక్రయించగా, సెప్టెంబర్‌లో 2,645 యూనిట్లకు చేరాయి. అయితే, ఈ ఆధిక్యం నెల మొత్తం కొనసాగుతుందా? లేదా ఓలా తిరిగి పుంజుకుని టాప్-5 స్థానాన్ని దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఆంపియర్ ఓలాను అధిగమించింది. 2026 ఫిబ్రవరిలో ఆంపియర్, ఓలా కంటే ఎక్కువ వాహనాలను విక్రయించింది.

ఆగస్టులో టాప్‌లో టీవీఎస్
2026 ఆగస్టులో భారత మార్కెట్లో మొత్తం 1,83,204 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించబడ్డాయి. 48,938 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ మోటార్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ ఆటో 41,114 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, ఏథర్ ఎనర్జీ 28,757 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక, హీరో విడా 19,007 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉండగా, ఓలా ఎలక్ట్రిక్ 13,852 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్‌కు చెందిన ఆంపియర్ ఆగస్టులో 8,613 యూనిట్లను విక్రయించింది.. ఇప్పుడు అనూహ్యంగా.. టాప్ 5 నుంచి ఓలా ఔట్‌ అయ్యింది..