
చెన్నై: రెండు నెలల సుదీర్ఘ విరామం కారణంగా తాను శ్రీలంక టూర్‌లో వేగం, లయ కోల్పోయానని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే దులీప్ ట్రోఫీలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ద్వారా మళ్లీ పాత లయను అందుకున్నానని చెప్పాడు.
‘రెండు నెలల విరామం తర్వాత నేరుగా మ్యాచ్ ఆడటం వల్ల నా లయ సరిగా కుదరలేదు. నేను పూర్తిగా రిథమ్ బౌలర్‌ని. నా లయ సరిగా లేకపోతే క్రీజు వద్ద పూర్తి వేగంతో బాల్‌ను విసరలేను. లంకలో అదే సమస్యగా మారింది. నా రనప్ అస్తవ్యస్తంగా అనిపించింది.
కొన్ని అడుగులు చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా పడ్డాయి. దీని వల్ల ఫ్లో దెబ్బతిన్నది. కానీ దులీప్ ట్రోఫీలో ఎక్కువ ఓవర్లు వేయడం వల్ల లయను అందుకోగలిగా. వేగం కూడా సహజంగానే పుంజుకుంది. రెండో టెస్ట్‌లో మూడున్నర రోజులు ఫీల్డింగ్ చేసి వచ్చాం. చెన్నైలో తీవ్రమైన ఎండలోనే ఆడాం. ఆట పట్ల మక్కువ వల్లే ఇది సాధ్యమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సాకులు చెప్పడానికి వీల్లేదు. దేశం కోసం సర్వశక్తులు ఒడ్డి ఆడాలి’ అని సిరాజ్ పేర్కొన్నాడు.