
ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. 2026 సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 5:30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉంటూ తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో రానున్న 48 గంటల్లో మత్స్యకారులు ఉత్తర, మధ్య బంగాళాఖాతంలోకి.. అలాగే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. ఈ అల్పపీడన ప్రభావం ప్రస్తుతానికి రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలపై పెద్దగా ఉండదని పేర్కొంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.