Reading Time: < 1 minute
Modi Pezeshkian Meeting Iran Crisis Brics Summit 2026

BRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభమే ఇరువురు నేతల మధ్య కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉంది.

ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత ప్రయాణం, పౌర మౌలిక వసతుల రక్షణ అంశాలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ముందు ఆగస్టు 31న కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌లో మోడీ, పెజెష్కియాన్ భేటీ అయ్యారు. ఇరాన్‌లో కొనసాగుతున్న ఘర్షణను ముగించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

పెజెష్కియాన్ ఢిల్లీ పర్యటనకు ముందు బ్రిక్స్ ప్రాధాన్యతను ప్రస్తావించారు. ప్రపంచంలో పెరుగుతుున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక స్థైర్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిక్స్ బ్యాంక్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కరెన్సీకి ఆయన మద్దతు తెలిపారు.