
నార్వే రాజు హెరాల్డ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి జెలెస్కీ మంగళవారం మోల్దోవో నుంచి ఓస్లో బయలుదేరారు. విమానం మోల్దోవో నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ విమానాన్ని ఢీకొట్టబోయింది. విమానం వేగంగా ముందుకు కదలటంతో డ్రోన్ దాడి నుంచి తప్పించుకోగలిగింది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ విషయాన్ని నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
రెండు దేశాల ప్రకటనల్లో తేడా
జెలెన్‌స్కీ విమానం డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకుందని నార్వే ప్రధాని మీడియాకు తెలిపారు. అయితే గగనతలంలో డ్రోన్ల సంచారం ఉండటం వల్ల అక్కడ ఒక హెచ్చరిక (అలర్ట్) జారీ అయిందే తప్ప, విమానాన్ని ఢీకొనడానికి నేరుగా ఏ డ్రోన్ రాలేదని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను రెండు దేశాలు వేర్వేరుగా వివరించడం విశేషం. ప్రమాదం తృటిలో తప్పిందని నార్వే ప్రధాని అంటే, కేవలం భద్రతా హెచ్చరిక మాత్రమే వచ్చిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.
రష్యా డ్రోన్ గా అనుమానం
మోల్డోవా అధికారుల వివరాల ప్రకారం గగనతలంలో డ్రోన్ ముప్పు కనిపించడంతో అధికారులు కొంతసేపు ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానంతో పాటు మరికొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోల్డోవా ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, మొత్తం మూడు బయలుదేరే విమానాలు, నాలుగు చేరాల్సిన విమానాలు ఆలస్యమయ్యాయి. డ్రోన్ ముప్పు తగ్గిన తర్వాత గగనతల ఆంక్షలను తొలగించి జెలెన్‌స్కీ విమానాన్ని టేకాఫ్‌కు అనుమతించారు.
మోల్డోవా పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి డ్రోన్ శకలాలను కనుగొన్నారు. శకలాలను బట్టి రష్యా యుద్ధంలో వాడుతున్న ‘గెరన్’ (Geran) రకం డ్రోన్ పోలికలే ఇందులోనూ ఉన్నట్లు అధికారులు చెప్పారు. డ్రోన్ పడిన చోట పెద్ద గుంత ఏర్పడింది. అసలు ఆ డ్రోన్‌లో ఎంత పేలుడు పదార్థం ఉందనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మోల్డోవా అధికారులు చెప్పినదాని ప్రకారం, ఈ డ్రోన్ ముందుగా రొమేనియా గగనతలంలోకి కూడా వెళ్ళింది. రొమేనియా నాటో (NATO) లో సభ్య దేశం కావడంతో ఈ ఘటన మరింత టెన్షన్ పుట్టించింది. ఈ డ్రోన్ ఎక్కడెక్కడ తిరుగుతోందో కనిపెట్టడానికి స్పెయిన్ దేశానికి చెందిన రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించారు. ఆ తర్వాత ఆ డ్రోన్ తిరిగి మోల్డోవా గగనతలంలోకి వచ్చి అక్కడే కూలిపోయింది.
డ్రోన్ ముప్పు వల్ల విమానం కొంతసేపు ఆలస్యమైనప్పటికీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సురక్షితంగా నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు. ఆయన అక్కడ నార్వే రాజు హెరాల్డ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నార్వే ప్రధాని స్టోర్‌తో పాటు రక్షణ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. యూరప్ గగనతల రక్షణను మరింత పటిష్టం చేసే ‘ఫ్రేయా’ (FREYJA) యాంటీ-బ్యాలిస్టిక్ ప్రోగ్రామ్‌పై సమావేశంలో చర్చలు జరిపారు. అంత్యక్రియల అనంతరం నార్వే నుంచి కెనడా వెళ్లిపోయారు.
2022లో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాలైన మోల్డోవా, రొమేనియా గగనతలాల్లో రష్యా డ్రోన్లు ప్రవేశించడం చాలా సార్లు జరిగింది. జెలెన్‌స్కీ విమాన ప్రయాణానికి ఎదురైన ఈ తాజా అనుభవం, ఆ ప్రాంతంలో పౌర విమానయానానికి ఎంతటి భద్రతా ముప్పు పొంచి ఉందనే ఆందోళనలను మరోసారి తీవ్రం చేసింది. అసలు ఈ డ్రోన్ల సంచారానికి ఈ ఘటన వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటనే దానిపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది.
నిత్య సంఘర్షణ
మోల్డోవా నుంచి జెలెన్‌స్కీ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో డ్రోన్ దాదాపు ఢీకొనే పరిస్థితి వచ్చిందని అంతకు ముందు నార్వే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ‘NRK’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతి రోజూ ప్రమాదకర వాతావరణంలోనే జీవిస్తున్నారని స్టోర్ తెలిపారు.