Reading Time: 2 minutes

బొజ్జగణపయ్యకు చాలా ఇష్టం.. పూర్ణం కుడుములు.. పులిహార.. ఇలా ప్రిపేర్ చేయండి..చాలా రుచిగా ఉంటాయి..!

Caption of Image.

భోజన ప్రియుడైన బొజ్జ గణపయ్యకు…ఎన్ని ఫలహారాలు పెట్టినా తక్కువే.మరి వినాయక చవితి రోజు ( సెప్టెంబర్​ 14)  వివిధరకాల నైవేద్యాలు పెట్టాల్సిందేగా.అందుకే ఆయనకుఇష్టమైన, రుచికరమైన వంటలు  పూర్ణం కుడుములు, పులిహార ఈ పండుగకు ఇవి చేసి నైవేద్యంగా పెట్టండి. . ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!

పూర్ణం కుడుములు తయారీకి  కావాల్సినవి 

  •   శెనగపప్పు: ముప్పావు కప్పు
  •  బెల్లం- తురుము: ఒక కప్పు
  •  ఎండు కొబ్బరి తురుము:- అర కప్పు
  •  బియ్యప్పిండి:- ఒకటిన్నర కప్పు
  •  ఇలాచీ పొడి:- ఒక టేబుల్‌‌ స్పూన్‌
  •  ఉప్పు: చిటికెడు
  •  నెయ్యి: సరిపడా

పూర్ణం కుడుములు తయారీ విధానం

శెనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌‌లో ఒక విజిల్‌‌ వచ్చేవరకు ఉడికించాలి. కొద్దిసేపయ్యాక పప్పులో ఉన్న నీటిని పారబోసి పక్కనపెట్టాలి. స్టవ్​పై ఒక గిన్నె పెట్టి, అందులో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన శెనగపప్పు, ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి పది నిమిషాలు ఉడికించాలి.

 మిశ్రమం గట్టి పడ్డాక స్టవ్​ ఆపేయాలి. అది చల్లారిన తర్వాత ఉండలుగా చేసి ఒక ప్లేట్‌‌లో వేయాలి. తర్వాత మరో గిన్నెలో  కొద్దిగా నెయ్యి, ఉప్పు, బియ్యప్పిండి, సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి.

 చేతికి నూనె రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని పల్చటి బిళ్లలుగా వత్తి, మధ్యలో శెనగపప్పు ఉండల్ని పెట్టి గుండ్రంగా చేయాలి. నూనె లేదా నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ కుడుములను పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.

పులిహోర తయారీకి కావాల్సినవి 

  • అన్నం: మూడు కప్పులు
  •  చింతపండు గుజ్జు: పావు కప్పు
  •  బెల్లం తురుము: ఒక టీ స్పూన్ (కావాలంటే)
  •  మినప్పప్పు: ఒక టీ స్పూన్
  •  శెనగపప్పు: ఒక టీ స్పూన్
  •  ఆవాలు: అర టీ స్పూన్​
  •  జీలకర్ర: అర టీ స్పూన్​
  •  మెంతులపొడి: అర టీ స్పూన్​
  •  పల్లీలు: కొద్దిగా 
  • ఇంగువ: చిటికెడు
  •  పచ్చిమిర్చి: నాలుగు
  •  ఎండుమిర్చి: నాలుగు
  •  జీడిపప్పు పలుకులు: అర టేబుల్​ స్పూన్​ (కావాలంటే)
  •  పసుపు: అర టీ స్పూన్
  •  కరివేపాకు: ఒక రెమ్మ 

పులిహోర తయారీ విధానం

  ఒక గిన్నె లో అన్నం వేసి చల్లార్చాలి. ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కలపాలి.  స్టవ్​పై పాన్​పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, పసుపు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, మెంతుల పొడి, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఆ పోపును అన్నంలో వేసి కలపాలి. అంతే టేస్టీ పులిహార రడీ..!  

©️ VIL Media Pvt Ltd.