
హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 2026 సెప్టెంబర్ 12వ తేదీన చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందాడు.
పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పోస్నెట్ దినకర్(35) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పటాన్ చెరు జేపీ కాలనీలో నివాసం ఉంటున్న దినకర్ 11వ తేదీ ఉదయం పనిమీద స్కూటీపై నల్లగండ్లకు వెళ్లాడు. మధ్యాహ్నం నల్లగండ్ల నుంచి పటాన్ చెరు వస్తుండగా స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయాడు.
స్కూటీపై నుంచి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స కోసం బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన దినకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి సోదరుడు శుభాకర్ చార్లెస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు చందానగర్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.