Reading Time: 2 minutes

సెప్టెంబర్ 16కు తెలంగాణ అసెంబ్లీ వాయిదా

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 16కు వాయిదా పడింది. ఈ మేరకు శాసన సభను ఒక రోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16న శాసన సభలో ఎల్‎నినోపై సుదీర్ఘ చర్చ జరగనుంది. వర్షాభావ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి..? రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. అలాగే, నిషేధిత భూముల జాబితా (22ఏ) అంశంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. 

2026, సెప్టెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‎లో స్పీకర్ నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 12తో ఈ సెషన్ ముగియాల్సి ఉంది. కానీ అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా  సెప్టెంబర్ 16కు శాసన సభ వాయిదా పడింది. ఆ రోజున ఎల్ నినో పరిస్థితులపై సభలో చర్చ జరగనుంది. 

22ఏపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం:

రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోన్న నిషేధిత భూముల జాబితా (22ఏ) అంశంపై శనివారం (సెప్టెంబర్ 12) శాసన సభలో ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. సుదీర్ఘంగా చర్చించిన మంత్రి పొంగులేటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 22ఏను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదని, 1999లోనే 22ఏ నిబంధన అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

అసైన్డ్, ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకే 22ఏను తీసుకొచ్చారని తెలిపారు. 2015లో 22ఏ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిందని పొంగులేటి అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 22ఏ భూములను ఐదు కేటగిరీలుగా విభజించారని, అనంతరం 2016లో జీవో నంబర్ 121ను తీసుకొచ్చారని చెప్పారు. అయితే జీవో జారీ చేసినప్పటికీ అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించలేదన్నారు.

ధరణి తీసుకొచ్చే క్రమంలో కోర్టు ఆదేశాలను పక్కన పెట్టారని పొంగులేటి ఆరోపించారు. 2017 నుంచి 2025 వరకు 28,611 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమస్యల కారణంగా భూబాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు. నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోర్టు ఆదేశించిందని మంత్రి తెలిపారు. కోర్టు సూచించిన నియమ నిబంధనల ప్రకారం కమిటీని ఏర్పాటు చేసి, నిషేధిత జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచామని చెప్పారు.

కొత్తగా ఏ భూమినీ 22ఏలో చేర్చలే

తమ ప్రభుత్వం కొత్తగా ఏ భూమినీ నిషేధిత జాబితాలో చేర్చలేదని పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో ఉన్న భూములే ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. 22ఏ జాబితాలో పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించిన మంత్రి.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గానీ, స్వలాభం కోసం గానీ ఆ తప్పులు చేయలేదన్నారు. జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించిందని పొంగులేటి తెలిపారు. 

మూడు విడతల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులతో చర్చలు జరిపామని చెప్పారు. సంబంధిత కాపీలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే 22ఏకు సంబంధించిన పొరపాట్లను పరిష్కరించి రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు:

22ఏ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దన్నారు. అసలు 22ఏ లో ఎన్ని భూములున్నాయన్న వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ వివరాలను ఎందుకు పబ్లిక్ డొమైన్‎లో పెట్టడం లేదని ఫైర్ అయ్యారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి పోర్టల్‎లో కూడా తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. రైతుల భూముల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. లేని భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.

©️ VIL Media Pvt Ltd.