
నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
ఖ్యాతిం చెందిన సంపదన్ నిలవనీ గాఢంబుగా సాగనీ
ఘతంబప్పుడ పొందనీ నియతిమై గానీ యుగాంతంబునన్
నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్
నిందించినా, ప్రశంసించినా, సంపదలు వచ్చినా, తొలగిపోయినా, ఆ క్షణంలోనే మరణం వచ్చినా, ఆ మరణమే కల్పాంతంలో వచ్చినా… ధీరులైనవారు న్యాయ మార్గాన్ని అతిక్రమించరు. అన్యాయం వైపు ఒక్క అడుగు కూడా వేయరని భర్తృహరి (ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించిన పద్యం) చెప్తున్నాడు.
ధీరులైనవారు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా న్యాయమార్గాన్ని దాటరనే విషయాన్ని ఈ పద్యం వివరిస్తోంది. మనం నమ్ముకున్న మంచి మార్గాన్ని అనుసరించి జీవించేవారిని పలువురు పలు రకాలుగా భావించవచ్చు. కొందరు మనం అనుసరించే మార్గం తప్పని నిందించవచ్చు. మరికొందరు మంచి మార్గమని పొగడొచ్చు. అయితే ధీరుడైనవాడు నిందలను, పొగడ్తలను.. వేటినీ లెక్క చేయడు.
తాను నమ్మిన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సంపదలు రావొచ్చు, ఒక్కొక్కసారి ఉన్న సంపదలు పోవచ్చు, ధీరుడైనవాడు ఈ రెండింటినీ లెక్కచేయడు. మంచిచెడులలో ఏది జరిగినా దానిని లెక్కచేయకుండా, తాను నమ్మిన న్యాయమార్గాన్నే త్రికరణశుద్ధిగా అనుసరిస్తాడు. ఒక్క అడుగు కూడా అతిక్రమించడు. వేటినీ లెక్కచేయకుండా తన పనిని తాను చేసుకోవడంలో నిమగ్నమైపోతాడు. ఇటువంటి వారిని స్థితప్రజ్ఞులు అంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మనకు శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు.
శ్రీరామునికి పట్టాభిషేకం అని చెప్పినప్పుడు, మరుసటి రోజు అరణ్యవాసానికి వెళ్లాలి అన్నప్పుడు… రెండు సందర్భాలలోనూ రాముడు స్థిరచిత్తంతో తన పని తాను చేసుకున్నాడు. అదేవిధంగా మహాభారతంలో పాండవులు జూదంలో సర్వం కోల్పోయి అరణ్యాలకు వెళ్లవలసిన వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ధైర్యంగా వనవాసం సాగించారు.
పరీక్షిత్తు మహారాజు కథ తెలిసిందే.
శాపకారణంగా పరిక్షిత్తు మరో వారం రోజుల్లో మరణిస్తాడని తెలిసింది. ఆయన ఏమాత్రం కుంగిపోకుండా, ఈ వారం రోజులపాటు ఏవైనా మంచి విషయాలను బోధించమని శుక మహర్షిని కోరాడు. అప్పుడు శుక మహర్షి శ్రీమద్భాగవత గాథను వారం రోజుల పాటు ఏకధాటిగా పరీక్షిత్తుకి బోధించాడు. మరణం తక్షణమే వస్తోందని తెలిసినా పరీక్షిత్తు చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో నిలబడ్డాడు.
మరో కథ
దధీచి మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడైన అధర్వణ మహర్షి కుమారుడు. ఆయన సరస్వతీ నదీతీరాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కఠోర తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. తపశ్శక్తి వల్ల ఆయన ఎముకలు వజ్రంలా అత్యంత దృఢంగా మారాయి.
దేవతలకు, దానవులకు జరిగిన యుద్ధంలో వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు తమను కాపాడమని మహావిష్ణువును ప్రార్థించారు. వృత్రాసురుడిని సాధారణ ఆయుధాలతో చంపడం అసాధ్యమని, దధీచి మహర్షి ఎముకలతో తయారు చేసిన ఆయుధంతో మాత్రమే అది సాధ్యమవుతుందని విష్ణువు చెప్పాడు.
►ALSO READ | వినాయకచవితి స్పెషల్: మొదట మట్టి గణపతిని ఎవరు తయారు చేశారు.. వినాయకుడికి రూపాన్ని ఇచ్చిందెవరు?..!
దేవతలందరూ పరుగుపరుగున దధీచి మహర్షి ఆశ్రమం చేరుకుని, తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నారు. అందుకు సమాధానంగా దధీచి, ‘దేవతలారా! నా వల్ల మీకు ఎటువంటి సాయం కావాలో కోరుకోండి’ అని పలికాడు. అందుకు దేవతలంతా ముక్తకంఠంతో, ‘మహర్షీ! మీ శరీరాన్ని మీరు దానం చేయాలి’ అని కోరారు. ‘ఈ శరీరం ఏదో ఒక రోజు నశించేదే, దీనివల్ల లోకానికి మేలు జరుగుతుందంటే అంతకు మించిన ఆనందం ఏముంది’ అని దధీచి సంతోషంగా అంగీకరించాడు. తన యోగశక్తితో ధ్యానంలోకి ప్రవేశించి, ప్రాణాలను విడిచిపెట్టాడు.
అప్పుడు విశ్వకర్మ ఆ మహర్షి వెన్నెముకతో శక్తివంతమైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించి, ఇంద్ర లోకాన్ని రక్షించాడు. దధీచి మహర్షి తనకు వెంటనే మరణం సంభవిస్తోందని తెలిసినా, చిరునవ్వుతో తన శరీరాన్ని సమర్పించాడు. ధీరులైనవారు అంత ఆత్మవిశ్వాసంతో ఉంటారనడానికి ఈ మహర్షి జీవితం చక్కటి ఉదాహరణ.
సోక్రటీసు ఒక గ్రీకు తత్త్వవేత్త. అతని పరిశోధలను గ్రీకు ఛాందసులు తిరస్కరించారు. అంతేకాదు. సోక్రటీసును జైలులో ఉంచారు. అంతటితో ఆగక మరణశిక్ష విధించారు. మరణశిక్షకు ఒక గంట ముందు కూడా అతను సంగీతంలో ఒక కొత్త రాగం నేర్చుకున్నాడట. పక్కనే ఉన్న కొందరు, ‘మరొక గంటలో చనిపోతావు, ఇప్పుడు సంగీతం నేర్చుకుని ఏం లాభం’ అని ప్రశ్నించారట. అందుకు సమాధానంగా, ‘చనిపోయే ముందైనా నేర్చుకునే అవకాశం దొరికింది కనుక, నేర్చుకుని చనిపోతాను’ అని సమాధానమిచ్చాడట. ధీరులైనవారిలో ఉండే గొప్ప లక్షణం ఇదే.
– డా. పురాణపండ వైజయంతి
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.