Reading Time: 2 minutes

మళ్లీ నోరు పారేసుకున్న కేటీఆర్.. రాష్ట్రంలో గజానికొక గజదొంగ అంటూ కామెంట్

Caption of Image.
  • ఇందిరమ్మ రాజ్యంలో ల్యాండ్​ చోరీ జరుగుతున్నది
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆరోపణ
  • బీఆర్ఎస్​ హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలే 
  • కాంగ్రెస్​ ప్రభుత్వం 1.16  కోట్ల ఎకరాలను పెట్టేసింది
  • రాష్ట్రంలో సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తున్నదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్​ చోరీ జరుగుతున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో భూములు దోచుకుంటున్నారని, గజానికొక గజదొంగ ఉన్నారని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.16 కోట్ల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. సీఎం రేవంత్​ బ్రదర్స్​భూములను కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. మంత్రుల ముఠా అలీబాబా అర డజన్​ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. 

మంచిరేవులలో సీఎం రేవంత్​ సోదరుల భూ కుంభకోణాన్ని మంత్రి కూతురు బయటపెట్టడంతోనే ఆ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్​ చేశారని అన్నారు. రాష్ట్రంలో సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తున్నదని, అల్లుడి కోసం గిరిజన భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆర్టీఐని అడ్డంపెట్టుకొని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసేవాడన్నారు. వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో..  రేవంత్ రెడ్డి అనే బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అయితే కూడా అలానే ఉందని అన్నారు. 

శుక్రవారం తెలంగాణభవన్​లో 22ఏపై ప్రజెంటేషన్​ సందర్భంగా కేటీఆర్‌‌‌‌ మాట్లాడారు. రాష్ట్రంలోని భూములను సీఎం హారతి కర్పూరంలా కాజేస్తున్నారని, ఆయన బాగోతాలు బయటపడుతాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మెడపట్టి బయటకు గెంటేశారని ఆరోపించారు. రేవంత్‌‌రెడ్డి తన అనుచరులకు నగరం నడిబొడ్డున ఉన్న భూములను కట్టబెడుతున్నారన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాలను అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజలకు మానసిక ప్రశాంతత లేదు

రాష్ట్ర ప్రజలకు మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని కేటీఆర్​ అన్నారు. కొంగరకలాన్‌‌లో కేసీఆర్  కలెక్టరేట్ కట్టారని, అక్కడ భూముల విలువ భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ఎకరం రూ. 50 కోట్ల వరకు పెరిగిందని చెప్పారు. అయితే, ఓ కంపెనీతో ఎకరానికి రూ.15 కోట్లకు భూములు ఇస్తామని రేవంత్​ డీల్ మాట్లాడారని, కానీ, అక్కడి ప్రజలకు మాత్రం ఎకరా కేవలం రూ.5 కోట్లే చెప్పారని అన్నారు.

  ప్రజలు ఒప్పుకోకపోవడంతో అక్కడి వంద ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. దీనిపై తాను ఆ కంపెనీకి లేఖ రాస్తానని చెప్పారు. బిల్డర్లను బెదిరించి కమీషన్లు వసూలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడాన్ని రాహుల్ గాంధీకి తెలియజేస్తామని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.