Reading Time: 3 minutes
‘RGV లేకపోతే నా లైఫ్ లేదు.. అది వైరస్‌లా నన్ను మార్చేసింది’ IPS అక్షయ్ కుమార్

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రభావం తనపై ఎంతగా ఉందో ఐపీఎస్ అధికారి అక్షయ్ కుమార్ ఆసక్తికరంగా వెల్లడించారు. ఆర్జీవీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సివిల్ సర్వీసెస్ ప్రయాణం, ఆయన సినిమాలు, ఇంటర్వ్యూలు తనపై చూపిన ప్రభావం గురించి అక్షయ్ కుమార్ వివరించారు. సాధారణంగా ఒక వ్యక్తి సినిమాలు చూసి ప్రభావితమవడం సహజమే అయినా.. ఓ సివిల్ సర్వీసెస్ అభ్యర్థి తన ఆలోచనా విధానాన్నే మార్చుకున్నంతగా ఆర్జీవీ ప్రభావం చూపడం ఆసక్తిని కలిగించింది.

‘ఆయన మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం’

ఒక అంశంపై పది మంది మాట్లాడితే.. ఆర్జీవీ మాత్రం అందుకు భిన్నంగా తనదైన కోణంలో మాట్లాడతారని అక్షయ్ కుమార్ చెప్పారు. ఆయన చెప్పే ప్రతి విషయానికి లాజిక్, వివరణ ఉంటుందని తెలిపారు. ఆర్జీవీ ఇంటర్వ్యూలు ఎంత రాత్రైనా చూస్తానని, ఆయన మాట్లాడే తీరు, ఆలోచనా విధానం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించారు. తన సెకండ్ ఇయర్ వరకు ఒక రకంగా ఉన్న తన మాట్లాడే విధానం, ఆర్జీవీని చూసిన తర్వాత పూర్తిగా మారిపోయిందని అక్షయ్ కుమార్ తెలిపారు. ఆయన ప్రభావంతో తన ఐదుగురు స్నేహితులకు కూడా ‘వర్మ పిచ్చి’ ఎక్కించానని, ఇప్పుడు వారంతా ఆర్జీవీ అభిమానులుగా మారిపోయారని సరదాగా చెప్పారు.

‘ఆర్జీవీ లేకపోతే నా లైఫ్ లేదు.. కేవలం అభిమాని కాదు.. ఆర్జీవీ నుంచి చాలా నేర్చుకున్నా’

ఆర్జీవీ తన జీవితంపై చూపిన ప్రభావాన్ని అక్షయ్ కుమార్ చాలా బలంగా వివరించారు. ‘తను నన్ను ఎంతగా ప్రభావితం చేశాడంటే.. ఆర్జీవీ లేకపోతే నా లైఫ్ లేదు అని చెప్పగలను’ అంటూ మీడియా ముందు కూడా చెప్పడానికి తాను సిద్ధమేనన్నారు. మొదట ఆర్జీవీ సినిమాలు చూసేవాడినని, ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం తెలుసుకోవడం ప్రారంభించానని తెలిపారు. ‘సత్య’ వంటి సినిమాలను ఎన్నోసార్లు చూసినట్లు చెప్పారు. ఆ సినిమాలోని ప్రతి సీన్ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఆర్జీవీ నుంచి తాను నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఎక్కడ ఉన్నా టాప్‌లో ఉండాలి, జీవితాన్ని చాలా ఇంటెన్స్‌గా జీవించాలి అనేదని అక్షయ్ కుమార్ చెప్పారు. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఇదే ఆలోచన తనలో ఉండేదన్నారు. తాను పరీక్షకు సిద్ధమైనప్పుడు మొదటి ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతోనే చదివానని చెప్పారు. టెన్త్ క్లాస్ వరకు తాను సగటు విద్యార్థినేనని, ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ టాప్‌లో ఉండాలని కోరుకున్నానని వివరించారు.

సివిల్ సర్వీసెస్‌లో 624వ ర్యాంక్ రావడం తనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని అక్షయ్ కుమార్ తెలిపారు. తాను మొదటి ర్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నానని, అయితే మెయిన్స్‌లో కొన్ని తప్పులు చేశానని తర్వాత గుర్తించానన్నారు. మరోసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని, తాను కోరుకున్న క్యాడర్ కూడా లభించే అవకాశం ఉందని తెలిసినా.. మరింత మెరుగైన ర్యాంక్ కోసం మరోసారి ప్రయత్నించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘624 నా కోసం కాదు.. నేను నన్ను ఇంకా మెరుగైన ర్యాంక్‌తో సమాజంలోకి లాంచ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నా మెంటల్ సాటిస్ఫాక్షన్’ అని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

‘నా సినిమాలు చూడకుండా ఆయన మెయిన్స్ రాయలేదు.. అది వైరస్‌లా పని చేసింది’.. RGV రియాక్షన్‌

IPS అక్షయ్ కుమార్ తనకు ఇంతటి అభిమాని అని తెలుసుకుని ఆశ్చర్యపోయానని ఆర్జీవీ తెలిపారు. అయితే అది తన సినిమాల ప్రభావం కంటే ‘రాముయిజం’ ప్రభావం కావచ్చని అభిప్రాయపడ్డారు. అక్షయ్ కుమార్ తన సినిమాలు, ఇంటర్వ్యూలను ఎంతగా ఫాలో అయ్యారో తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పారు. సివిల్ సర్వీసెస్ వంటి కీలక పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో కూడా అక్షయ్ తన సినిమాలు చూస్తుండేవారని, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు రాత్రి 1.30 గంటలైనా తన సినిమా లేదా ఇంటర్వ్యూ చూసిన తర్వాతే వెళ్లేవారని ఆర్జీవీ పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ మాట్లాడే విధానంలో కూడా ఆర్జీవీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆర్జీవీ చెప్పారు. ముఖ్యంగా ప్రజలతో మాట్లాడే తీరు, యాస, కొన్ని పదాలను ఉపయోగించే విధానం తనను పోలి ఉన్నట్లు తెలిపారు. తన ప్రభావం అక్షయ్‌పై ఒక వైరస్‌లా పనిచేసిందని ఆర్జీవీ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే అక్షయ్ తన సినిమాల కంటే తన ఇంటర్వ్యూలు, ఆలోచనా విధానమైన ‘రాముయిజం’ ద్వారా ఎక్కువగా ప్రభావితమై ఉండవచ్చని అన్నారు. ఇటీవల తనను కలిసే వివిధ వయసుల వారు ‘రాముయిజం’ గురించి మాట్లాడుతున్నారని ఆర్జీవీ చెప్పారు. ముఖ్యంగా యువత, టీనేజర్లు కూడా తన సినిమాల కంటే తన ఇంటర్వ్యూలు, ఆలోచనా విధానం గురించి మాట్లాడటం తనను ఆశ్చర్యపరుస్తోందన్నారు.

ఒకసారి ఓ సీనియర్ పోలీస్ అధికారి తనను కలసి ‘ఐ హేట్ యూ’ అని చెప్పిన ఘటనను కూడా ఆర్జీవీ గుర్తుచేసుకున్నారు. తన భార్యకు ‘రాముయిజం’ అంటే విపరీతమైన అభిమానం ఉందని, ఇంట్లో ఎక్కడ చూసినా తన పుస్తకం లేదా ఫొటో కనిపిస్తుందని ఆ అధికారి చెప్పారట. ఇంట్లో ఏ విషయం మాట్లాడినా తన భార్య ఆర్జీవీ మాటలను కోట్ చేస్తుంటారని, దీంతో కుటుంబ సభ్యులందరికీ తనపై చిరాకు వచ్చేసిందని ఆ అధికారి సరదాగా చెప్పినట్లు ఆర్జీవీ వెల్లడించారు. మొత్తానికి, ఒక సినీ దర్శకుడి ఆలోచనా విధానం ఓ సివిల్ సర్వీసెస్ అభ్యర్థి వ్యక్తిత్వంపై ఎంతటి ప్రభావం చూపిందో అక్షయ్ కుమార్–రామ్ గోపాల్ వర్మ సంభాషణ మరోసారి ఆసక్తికరంగా మారింది.