
Lala Amarnath: భారత క్రికెట్ చరిత్రను తిరగేస్తే కొన్ని పేర్లు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కావు, వ్యవస్థనే మార్చేసిన శక్తులుగా మిగిలిపోతాయి. అలాంటి అరుదైన దిగ్గజమే లాలా అమర్‌నాథ్. 115 ఏళ్ల క్రితం, అంటే 1911 సెప్టెంబర్ 11న లాహోర్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అమర్‌నాథ్, భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. కేవం 24 టెస్టుల ఆడిన ఆయన భారత క్రికెట్‌లో అపారమైన ముద్ర వేశారు. 1933-34లో సదరన్ పంజాబ్ తరఫున ఎమ్‌సీసీపై 109 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ఆయన, బాంబేలోని జిమ్‌ఖానా మైదానంలో ఇంగ్లాండ్‌పై జరిగిన భారత తొలి స్వదేశీ టెస్టులో 117 నిమిషాల్లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించారు. భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ బ్యాటింగ్ శైలి దేశమంతటా ఆయన్ను హీరోగా నిలబెట్టింది.
అయితే అమర్‌నాథ్ ప్రస్థానం పూలబాటేమీ కాదు. 1936 ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో జట్టు కెప్టెన్ విజయనగరం మహారాజ్‌కుమార్ (విజ్జీ)తో తీవ్ర విభేదాలు రావడంతో, టూర్ మధ్యలోనే ఆయన్ను భారత్‌కు తిప్పి పంపేశారు. ఈ వివాదం వల్ల ఆయన దాదాపు 12 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. అయినా తగ్గని ఆయన, రంజీల్లో 1938-39లో ‘ది రెస్ట్’ జట్టుపై హిందూస్ తరఫున 241 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత 1946 ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ టెస్టులో బౌలర్‌గా చెలరేగి లేన్ హటన్, డెనిస్ కాంప్టన్ వంటి దిగ్గజాల వికెట్లు పడగొట్టి తనలోని ఆల్‌రౌండ్ సత్తాను నిరూపించుకున్నారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతిని లోపలికి రప్పించే ఆయన నైపుణ్యం జట్టుకు కొండంత బలంగా మారేది.
1947లో విజయ్ మర్చంట్ తప్పుకోవడంతో తొలి ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఆయనకే దక్కింది. డాన్ బ్రాడ్‌మాన్ నేతృత్వంలోని బలమైన ఆసీస్‌పై సిరీస్ ఓడిపోయినప్పటికీ, విక్టోరియాపై అమర్‌నాథ్ చేసిన 228 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆసీస్ దిగ్గజం నీల్ హార్వే ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత 1952-53లో పాకిస్థాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి అధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలిపి మరో చరిత్ర సృష్టించారు. అయినప్పటికీ, నాటి క్రికెట్ బోర్డు అధికారులతో ఉన్న విభేదాల వల్ల ఆయన నాయకత్వ ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తన కెరీర్‌లో 24 టెస్టులాడి 878 పరుగులు (1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు), 45 వికెట్లు తీసిన అమర్‌నాథ్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం 186 మ్యాచ్‌ల్లో 10,426 పరుగులు చేయడమే కాక 463 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా నిలిచారు.
ఆటగాడిగానే కాకుండా సెలెక్టర్‌గా కూడా లాలా అమర్‌నాథ్ భారత క్రికెట్‌ను మలుపు తిప్పారు. 1959-60లో ఆస్ట్రేలియాపై కాన్పూర్ టెస్టులో ఆఫ్ స్పిన్నర్ జసు పటేల్‌ను ఎంపిక చేయడం ఆయన సెలెక్టర్‌గా తీసుకున్న ధైర్యమైన నిర్ణయం కాగా, ఆ మ్యాచ్‌లో జసు పటేల్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించారు. అమర్‌నాథ్ వారసత్వాన్ని ఆయన కుమారులు సురీందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్ ముందడుగు వేయించారు. సురీందర్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేయగా, మోహిందర్ భారత్ తరఫున 69 టెస్టులు, 85 వన్డేలు ఆడి 1983 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మైదానంలోనూ, బయటా ఎప్పుడూ భయం లేకుండా నిజాయితీగా మాట్లాడే లాలా అమర్‌నాథ్ వ్యక్తిత్వాన్ని ముష్తాక్ అలీ వంటి సహచరులు కొనియాడగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయన్ను భారత క్రికెట్ ‘ఐకాన్’గా అభివర్ణించారు. బ్యాటర్, బౌలర్, కెప్టెన్, సెలెక్టర్, కోచ్, కామెంటేటర్‌గా భారత క్రికెట్‌కు ఆయన అందించిన బహుముఖ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే.