
ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా నెలకు కేవలం రూ. 2వేల 500 జీతంతో ప్రయాణం మొదలుపెట్టిన గుజరాత్ వ్యక్తి.. నేడు కోట్లకు అధిపతిగా ఎలా మారగలరు? హై సాలరీ, కోట్ల రూపాయల వారసత్వం లేకున్నా అహ్మదాబాద్‌కు చెందిన గిరీశ్ అగల్ తన పట్టుదలతో రూ.6 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. 51 ఏళ్ల వయసులో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ రూపంలో సాధించిన ఈ సంపద కేవలం అదృష్టం కాదు.. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్, క్రమశిక్షణల విజయ ప్రయాణం. ఈ గుజరాతీ వ్యక్తి ఆర్థిక ప్రయాణం నుంచి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన 7 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
1. కెరీరే మీ మొదటి పెట్టుబడి:
రూ.2వేల 500 జీతంతో మొదలైన ప్రయాణంలో గిరీశ్ అగల్ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. కెరీర్ ఎదుగుదలతో పాటు తన సంపాదనను పెట్టుబడులుగా మార్చడమే అతని విజయానికి తొలి మెట్టు. కేవలం జీతంపై ఆధారపడకుండా.. దానిని పెంచుకుంటూ పోవడమే అసలైన సంపద సృష్టికి దారితీస్తుందని నిరూపించారు.
2. జీవిత ఒడిదుడుకులను తట్టుకునే ప్లాన్:
2006లో దూకుడుగా రూ.7వేల SIP ప్రారంభించినా.. 2008 మార్కెట్ క్రాష్‌లో పెట్టుబడులు 70 శాతం పడిపోవడంతో ఆపేశాడు. ఇల్లు, కారు లోన్లు, పిల్లల బాధ్యతల మధ్య ఒత్తిడిని ఆ సమయంలో తట్టుకోలేకపోయారు. దీన్నిబట్టి కేవలం తొందరగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని గ్రహించాడు.
3. అప్పుల నుంచి బయటపడి:
అప్పుల భారం నుంచి బయటపడేయడమే వ్యూహం. మొదటి హోమ్ లోన్ తీర్చిన వెంటనే 2011 నుండి ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ రీస్టార్ట్ చేశారు. 2020లో కరోనా సమయంలో మిగిలిన లోన్లను సైతం ముందస్తుగా క్లోజ్ చేసి.. ఆ EMI చెల్లింపుల డబ్బు మొత్తాన్ని నేరుగా పెట్టుబడులకు మార్చాడు. అప్పుల విముక్తిని సంపద సృష్టికి మెట్లుగా మార్చుకున్నారు.
4. జీతం పెరిగినప్పుడల్లా SIP పెంపు:
గిరీశ్ విజయ రహస్యాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. జీతం పెరిగిన ప్రతిసారీ తన మ్యూచువల్ ఫండ్ SIP పెట్టుబడి మొత్తాన్ని క్రమంగా రూ.7వేల నుండి రూ.57వేల వరకు పెంచుకుంటూ పోయారు. ఆదాయ వృద్ధి, పొదుపు పెరుగుదల, ఎస్ఐపీ పెంపు అనే సూత్రమే ఆయనను కోట్లకు అధిపతిని చేసింది.
5. డబ్బును నిరుపయోగం ఉంచొద్దు:
2016 నాటికి సేవింగ్స్ అకౌంట్లో ఉన్న రూ. 25 లక్షలను అలాగే వదిలేయకుండా.. ఒకేసారి లంప్సమ్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాడు. మిగులు డబ్బును సరైన సమయంలో సరిగ్గా మళ్లించడం ద్వారా రాబడులను మరింత వేగవంతం చేసుకోవచ్చని ఈ నిర్ణయం నిరూపించింది.
6. మార్కెట్ క్రాష్: భయం కాదు, ప్రవర్తనకు పరీక్ష
2008లో భయపడి ఎస్ఐపీ ఆపేసిన గిరీశ్.. 2020 కోవిడ్ క్రాష్ సమయంలో మాత్రం తన తప్పును రిపీట్ చేయలేదు. పోర్ట్‌ఫోలియో పడిపోయినా ఏమాత్రం కంగారుపడకుండా అలాగే కొనసాగించారు. మొదటిసారి మార్కెట్ ఆయన ప్రవర్తనను మార్చితే.. రెండోసారి ఆయన అనుభవం మార్కెట్ గమనాన్ని చూసే ధైర్యాన్నిచ్చింది.
7. పర్ఫెక్షన్ కాదు సక్సెస్ ముఖ్యం:
ఈ ప్రయాణంలో ESOPs వదులుకోవడం, లోన్ల కోసం ప్రాపర్టీలపై దృష్టి పెట్టడం వంటి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సరైన నిర్ణయాలను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో రిపీట్ చేయడం వల్ల లక్ష్యాన్ని సాధించగలిగారు. అలా రూ.2వేల 500 జీతం నుంచి ప్రస్తుతం రూ.6 కోట్ల ఆస్తుల స్థాయికి చేరిన గిరీశ్ అగల్ ప్రయాణం.. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రయాణంతో ఎవరైనా సంపన్నులు కావచ్చని నిరూపిస్తోంది.