
హైడ్రా అధికారిక వెబ్సైట్ ప్రారంభించారు కమిషనర్ రంగనాథ్. 2026 సెప్టెంబర్ 11న హైడ్రా పోర్టల్ ను ప్రారంభించారు. పోర్టల్ తో ఇక నుంచి ఒకే వేదికపై హైడ్రా సేవలు, కార్యకలాపాల సమాచారం ఉండనుంది. ఇప్పటి వరకు ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉండగా ఇక నుంచి ఆన్ లైన్ లో ఫిర్యాదులతో పాటు ఎమెర్జెన్సీ సహాయం, వాతావరణ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.
హైడ్రా వెబ్‌సైట్‌లో అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల వివరాలు పోర్టల్‌లో పొందుపరిచింది హైడ్రా. అత్యవసర సహాయం కోసం 24 గంటల హెల్ప్‌లైన్ 1070 ను అందుబాటులోకి తెచ్చింది. చెట్లు కూలడం, వరదలు, నీటి నిల్వలు, అగ్ని ప్రమాదాలపై 1070కు సమాచారం ఇవ్వచ్చునని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పారు.
ఇక నుంచి హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫైర్ ఎన్‌వోసీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటర్‌లాగింగ్, వరద ప్రభావిత ప్రాంతాల మ్యాప్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
GHMC, CMC, MMC పరిధిలోని నీటి నిల్వ ప్రాంతాల వివరాలు అందుబాటులో ఉంటాయి. లైవ్ రైన్‌ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. చెరువుల FTL, బఫర్ జోన్ నిబంధనలపై పోర్టల్‌లో సమాచారం తెలుసుకోవచ్చు.
భూభారతితో హైడ్రా పోర్టల్ లింక్:
భూముల వివరాల కోసం భూ భారతి పోర్టల్‌కు నేరుగా లింక్ చేశారు. సర్వే నంబర్, పట్టాదారు వివరాలతో భూ రికార్డులు పరిశీలించే అవకాశం ఉంటుంది. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
హైడ్రా కార్యకలాపాలు, ఫొటోలు, వీడియోలు పోర్టల్‌లో చూడొచ్చు. హైడ్రా అధికారిక ప్రకటనలు, ప్రెస్ రిలీజ్‌ల కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి. హైడ్రాకు సంబంధించిన పూర్తి అధికారిక సమాచారాన్ని ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది హైడ్రా.
హైడ్రా పోర్టల్ లింక్: https://hydraa.telangana.gov.in/