
మ్యూచువల్ ఫండ్స్ ఆగస్టు నెల ఇన్వస్ట్మెంట్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరిగాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. జూలైలో 15 శాతం మేర క్షీణించిన ఈక్విటీ ఇన్ఫ్లోలు, ఆగస్టులో సుమారు 19 శాతం పెరిగి రూ. 29వేల 328 కోట్లకు చేరాయి. ఇది జూన్ నాటి రూ. 28వేల 973 కోట్ల స్థాయిని కూడా దాటడం గమనార్హం. దీనివల్ల ఈక్విటీ స్కీమ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా జూలైలోని రూ. 38.36 లక్షల కోట్ల నుంచి ఆగస్టు నాటికి సుమారు 2.2 శాతం పెరిగి రూ. 39.21 లక్షల కోట్లకు చేరుకుంది.
డెట్ ఫండ్ల విభాగంలో పూర్తిగా రివర్స్ ట్రెండ్ కనిపిపించింది. జూలై నెలలో రూ.లక్షా 87వేల 511 కోట్ల నికర ఇన్‌ఫ్లోలను నమోదు చేసిన డెట్ ఫండ్లు.. ఆగస్టులో మాత్రం రూ. 8వేల127 కోట్ల అవుట్‌ఫ్లోలకు పరిమితం అయ్యాయి. జూలైలో లిక్విడిటీ-ఓరియెంటెడ్ విభాగాలకు వచ్చిన భారీ కేటాయింపుల కారణంగా ఆ నెలలో గణనీయమైన వృద్ధి కనిపించగా.. ఆగస్టులో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే డెట్ విభాగానికి చెందిన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి పెద్ద మార్పులకు గురికాకుండా సుమారు రూ.19.33 లక్షల కోట్ల వద్దే స్థిరంగా ఉంది.
►ALSO READ | ఆపిల్ ఐఫోన్ డ్యూయో హైఎండ్ ధర 4 లక్షల 49 వేల రూపాయల.. : కొత్త కారు వస్తుంది కదా..!
ఇక ఇతర ప్రధాన విభాగాలైన హైబ్రిడ్ పథకాలు నికర పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నప్పటికీ.. వాటి వేగం మాత్రం కొద్దిగా మందగించింది. జూలైలో రూ.11వేల 490 కోట్లుగా ఉన్న హైబ్రిడ్ ఇన్‌ఫ్లోలు ఆగస్టులో దాదాపు 13 శాతం తగ్గి రూ.10వేల 045 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఆసక్తి భారీగా పెరిగింది. జూలైలో కేవలం రూ.వెయ్యి 558 కోట్లుగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు ఆగస్టులో దాదాపు 67 శాతం పెరిగి రూ. 2వేల 596 కోట్లకు చేరుకున్నాయి.