
విద్యాశాఖ తన దగ్గర ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరని కొందరు విమర్శిస్తున్నారని, అయితే అంతకుమించి తానే విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖపై తనకున్న ఆసక్తి కారణంగానే ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నానని తెలిపారు.పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానని సీఎం స్పష్టం చేశారు.
దేశానికి ఆదర్శంగా విద్యా విధానం
తెలంగాణలో అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. ఇందుకోసం అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకుంటామని చెప్పారు.
విద్యారంగంలో ఆధునిక విధానాలను తీసుకురావడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి కమిషన్ సభ్యులు అందించే విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలో 24,966 ప్రభుత్వ పాఠశాలలు
రాష్ట్రంలో మొత్తం 24,966 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 19,79,614 మంది విద్యార్థులు, 1,24,456 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు.అదేవిధంగా రాష్ట్రంలో 444 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో సుమారు 1.95 లక్షల మంది విద్యార్థులు, 6,359 మంది లెక్చరర్లు ఉన్నారని తెలిపారు.
వైఎస్సార్ హయాంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. విద్యా రంగంలో చేపట్టాల్సిన మరిన్ని సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు నిర్వహించిన సర్వే ద్వారా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. విద్యను మరింత ఆధునికంగా, నాణ్యంగా మార్చి ప్రపంచ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.