Reading Time: < 1 minute
Sabarimala Padipuja: శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం ఇదే!

Sabarimala Padipuja Telugu: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజ బుకింగ్‌లపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ఇకపై రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. పడి పూజ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటలైజ్ చేయనున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. జాబితాలో ఉన్న వారిలో మరణించిన వ్యక్తుల పేర్లను గుర్తించి తొలగిస్తామని పేర్కొంది. ఈ అంశంపై జస్టిస్ బి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన దేవస్వం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం 2040 సంవత్సరం వరకు పడి పూజ కోసం మొత్తం 705 మంది బుక్ చేసుకున్నట్లు సమాచారం. పడి పూజ రుసుము రూ.1,37,900గా ఉంది. అయితే మండల-మకరవిళక్కు సీజన్‌లో పడి పూజలను నిర్వహించరు.

ఇదిలా ఉండగా, కొప్రక్కలం సమీపంలోని చిన్న దుకాణాన్ని వెంటనే తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అలాగే చాలకాయం-పంబ రహదారి పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు దేవస్వం బోర్డు కోర్టుకు వెల్లడించింది.

పూర్తయిన అన్నదాన మండపం..

శబరిమలలో అన్నదాన మండపం నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిని ఇంకా ఎందుకు ప్రారంభించలేదో వివరణ ఇవ్వాలని దేవస్వం బోర్డును హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు, శబరిమలలో ప్రసిద్ధమైన అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 2 లక్షల నుంచి 2.25 లక్షల వరకు అరవణ కంటైనర్లు తయారవుతున్నాయి. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే చర్యల్లో భాగంగా కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్తగా ఆరు అరవణ తయారీ యూనిట్లు (వార్ప్‌లు), రెండు కూలింగ్ ఛాంబర్లు, ఒక బాయిలర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్లాంట్‌లో 26 అరవణ తయారీ యూనిట్లు, ఆరు కూలింగ్ ఛాంబర్లు, ఆరు బాయిలర్లు పనిచేస్తున్నాయి.

కొత్త ఏర్పాట్లు పూర్తయితే రోజువారీ అరవణ తయారీ సామర్థ్యం మరింత పెరగనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో అరవణ ప్రసాదానికి డిమాండ్‌ను తీర్చడమే ఈ విస్తరణ పనుల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.