
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చింది. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్‌లో ఏకంగా 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ భారీ షాక్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్ జోన్‌లో ఉండగా.. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్‌లో హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ పీకారు.
డబుల్ ఎలిమినేషన్..
‘అగ్నిపరీక్ష తర్వాతే అసలైన మహాపరీక్ష’ అంటూ ముందే హెచ్చరించిన నాగ్.. ఈసారి ఆట ఎంత సీరియస్‌గా ఉండబోతోందో మొదటి వీకెండ్‌లోనే చూపించారు. ఎలిమినేట్ అయిన చరణ్, చైత్ర సీక్రెట్ రూమ్‌లో ఉన్నారేమోనని హౌస్‌లో కంటెస్టెంట్లు అనుమానిస్తుండటంతో నాగార్జున ఆ డౌట్స్‌కు చెక్ పెట్టారు. లైవ్ కాల్‌లో చరణ్‌ను సంప్రదించి అతను తన ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పించారు. అనంతరం చైత్రతోనూ మాట్లాడించి ఆమె కూడా సీక్రెట్ రూమ్‌లో లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇకపై గేమ్‌పై అలసత్వం చూపితే ఎలాంటి సెకండ్ ఛాన్స్ ఉండదని నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నాగార్జున మాస్ వార్నింగ్..
ఇక టాస్కుల్లో అదరగొట్టిన రోహిత్ నాయుడు, ఆటో రాంప్రసాద్, టెంపర్ వంశీలకు నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. బిగ్‌బాస్ పంపించిన మిల్క్‌షేక్‌ను ముగ్గురితో తాగించారు. అయితే, అసలు డ్రామా ఆ తర్వాతే మొదలైంది. రోహిత్ గతంలో వేరొకరు తాగిన ఎంగిలి గ్లాసులు నేను కడగను అంటూ భీష్మించుకోవడాన్ని నాగ్ గట్టిగా నిలదీశారు. వాళ్ళు తాగిన ఖాళీ గ్లాసులను స్వయంగా వేదికపైనే కడిగి చూపించిన నాగార్జున.. ‘బిగ్‌బాస్‌లో ఏ పని తక్కువది కాదు. ఆటలో లేదా పనుల్లో అహంకారం, అలసత్వం చూపిస్తే హౌస్ నుంచి తట్టాబుట్టా సర్దేయాల్సిందే!’ అంటూ రోహిత్‌కి ఊహించని రేంజ్‌లో క్లాస్ పీకారు.
త్రిగుణ్‌కు పనిష్మెంట్..
మరోవైపు, రోహిత్‌పై ‘పిల్ల బచ్చా’, ‘స్టెరాయిడ్ డొల్ల’ అంటూ వ్యక్తిగత కామెంట్లు చేసిన త్రిగుణ్‌పై నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. నీ మాటల తీరు నీలోని గుణాన్ని తెలుపుతోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ఓన్లీ రియాక్షన్ కాదు.. ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉంటుంది అని చెబుతూ వెంటనే పనిష్మెంట్ విధించారు. గార్డెన్ ఏరియాలో భారీ టైర్‌ను పట్టుకుని తిరగాలని ఆదేశించడం హౌస్‌లో ఒక్కసారిగా టెన్షన్ పెంచింది.
ప్రస్తుతం హౌస్‌లో మిగిలిన 11 మంది కంటెస్టెంట్లకు నాగ్ సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రదర్శించినా తదుపరి ఎలిమినేషన్ మీదే అవుతుందని తెగేసి చెప్పారు. సాధారణంగా మొదటి వారాంతంలో సరదాగా సాగే నాగ్ ఎపిసోడ్.. ఈసారి మాత్రం ఫుల్ ఫైర్‌తో సాగడంతో బిగ్‌బాస్ 10పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ముందున్న వారాల్లో ఎవరు గేమ్ మార్చుకుంటారు? ఎవరు రిస్క్ నుంచి బయటపడతారు? అన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్ గా మారింది.