Reading Time: 2 minutes

జొమాటో కొత్త బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లపై రూ.5 అదనపు ఛార్జ్..!

Caption of Image.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్లాట్‌ఫాం ఫీజులు, ప్యాకింగ్ ఛార్జీలు, జీఎస్టీల పేరుతో జేబులు గుల్ల చేస్తున్న ఈ ఫుడ్ డెలివరీ యాప్.. తాజాగా మరో కొత్త ఛార్జీలతో కస్టమర్లకు వాత పెట్టింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే కస్టమర్లపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఆన్‌లైన్ పేమెంట్స్ మానేసి క్యాష్ ఇచ్చే కస్టమర్లపై ఈ సరికొత్త ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ని తీసుకొచ్చింది. 

బిల్లు సమ్మరీలో ఈ సరికొత్త ఛార్జీ ప్రత్యేకంగా కనిపిస్తుండటం గమనార్హం. ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఈ అదనపు భారం ఉండదు కానీ.. క్యాష్ ఇస్తామనే వారికి మాత్రం ఈ చుక్కలు చూపే రుసుము తప్పడం లేదు. ర్యాపిడో ‘ఓన్లీ’, ఫ్లిప్‌కార్ట్ ‘ఈట్ ఇన్’, స్విష్ వంటి కొత్త ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న వేళ.. జొమాటో ఇలా చిన్న చిన్న ఛార్జీల ద్వారా అదనపు ఆదాయాన్ని పిండుకునే కొత్త మాస్టర్ ప్లాన్‌కు తెరలేపింది.

ఈ ఫీజు జస్ట్ 5 రూపాయలే కదా అని తేలిగ్గా తీసుకుంటే పొరబడినట్టే. జొమాటో రోజువారీగా సుమారు 2.3 నుంచి 2.5 మిలియన్ల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. ఈ భారీ స్కేల్‌ను బట్టి చూస్తే.. క్యాష్ ఆన్ డెలివరీలపై పడే ఈ చిన్న ఛార్జీ ద్వారా కంపెనీకి రోజువారీగా కోట్లలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కేవలం ప్లాట్‌ఫాం ఫీజులనే ఇదివరకే రూ.15 వరకు పెంచిన జొమాటో.. ఇప్పుడు పేమెంట్ మెథడ్‌ను బట్టి కూడా బాదేయడం టెక్కీలను, ఫుడ్ ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది.

కాంపిటీటర్ స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ ఫీజును ప్రవేశపెట్టలేదు. కానీ జొమాటో మాత్రం చెక్‌అవుట్ పేజీలో చిన్న చిన్న ఛార్జీల రూపంలో కస్టమర్లకు తెలియకుండానే పెద్ద మొత్తంలో గుంజుతోంది. ఫుడ్ రేటు ఒకటైతే.. దానిపై డెలివరీ, ప్లాట్‌ఫాం, ప్యాకింగ్, ట్యాక్స్, చివరకు క్యాష్ ఇచ్చినందుకు పే ఆన్ డెలివరీ ఫీజులతో బిల్లు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది ఫుడ్ లవర్స్‌కి. ఆర్డర్ చిన్నదే అయినా కోట్ల మంది కస్టమర్లు ఉండటంతో ఈ రూపంలో వచ్చే ఆదాయం కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ఈ కొత్త ఛార్జీలను వేయటం స్టార్ట్ చేయెుచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.