కావాల్సిన పదార్థాలు : బియ్యప్పిండి 1 కప్పు, నీళ్లు (పిండి కోసం): ¾ కప్పు, ఉప్పు ¼ టీస్పూన్, బెల్లం తురుము 1 టేబుల్‌స్పూన్, పెసరపప్పు ¼ కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి ¼ టీస్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి 2 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్,కొన్ని, కాచి చల్లార్చిన పాలు1 కప్పు, ఉప్పు చిటికెడు.
ముందుగా ఒక పాన్‌లో ¾ కప్పు నీళ్లు పోసి, అందులో ¼ టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్‌స్పూన్ బెల్లం తురుము వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, స్టవ్ మంటను తగ్గించి, 1 కప్పు బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత పిండి దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆపి, మూత పెట్టి పిండిని పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. మరో గిన్నెలో ¼ కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి, 1 ½ కప్పుల నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 1 కప్పు నీళ్లు సరిపోతాయి. పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో కొద్దిగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
కొద్దిగా చల్లారిన బియ్యప్పిండిని చేతితో బాగా కలపాలి. అవసరమైతే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద నుండి చిన్న చిన్న ఉండ్రాలను తయారుచేయాలి. సుమారు ఒక రెండు ఉండ్రాలను విడిగా తీసి పెట్టుకుని, వాటిని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి . ఇది పాయసం చిక్కబడటానికి ఉపయోగపడతుంది. తర్వాత ఒక పెద్ద గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసుకున్న ఉండ్రాలను అందులో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఉండ్రాలు పైకి తేలితే అవి ఉడికినట్లు అర్థం.
ఉడికించిన ఉండ్రాలలోకి మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్‌లో మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఉండ్రాల పేస్ట్ ను నీటితో కలిపి ఈ మిశ్రమంలో వేసి, రెండు మూడు నిమిషాల పాటు చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించాలి. పాయసం కొద్దిగా చిక్కబడిన తర్వాత, 1 కప్పు బెల్లం తురుము వేసి, బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 2 టేబుల్స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, ¼ టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు సన్నని సెగపై ఉడికించి స్టవ్ ఆపివేయాలి.
ఒక చిన్న తాలింపు పాన్ తీసుకుని 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి, ఈ పాయసంలో వేసి కలపాలి. చివరిగా, 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి బాగా కలపాలి . చిటికెడు ఉప్పు వేసి కలిపితే రుచికరమైన పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం సిద్ధం.




