Reading Time: 2 minutes

బ్రిక్స్‌లో బిగ్ డీల్: రష్యన్ కంపెనీలతో జతకట్టిన అదానీ డిఫెన్స్.. రక్షణ రంగంలో గౌతమ్ అదానీ దూకుడు

Caption of Image.

భారత రక్షణ రంగంలో అదానీ గ్రూప్ తన సత్తా చాటుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజమైన ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’ రష్యా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ సంచలన రక్షణ ఒప్పందాలను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి డ్రోన్లు, చిన్న ఆయుధాల తయారీలో దూసుకెళ్తున్న అదానీ.. ఇప్పుడు రష్యా సహకారంతో ఏకంగా ఎయిర్ డిఫెన్స్  తయారీలోకి అడుగుపెట్టింది. సాంకేతిక బదిలీ, దేశీయంగానే ఆయుధాల తయారీ లక్ష్యంగా అదానీ దూకుడు పెంచింది.

గడిచిన రెండేళ్లలో అదానీ డిఫెన్స్ సంస్థ రష్యాకు చెందిన ‘స్పెక్టెక్ ఎల్‌ఎల్‌సీ’తో కలిసి త్రివిధ దళాల కోసం ‘ఇగ్లా-ఎస్’ మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సప్లై కోసం కనీసం ఆరు అత్యవసర కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుంది. అంతేకాకుండా సరికొత్త అత్యాధునిక షోల్డర్-ఫైర్డ్ క్షిపణులైన ‘9K333 వెర్బా’ తయారీ కోసం ఏకంగా రూ.18వందల కోట్ల భారీ కాంట్రాక్టు ఫైనల్ చర్చల్లో ఉంది. ఈ క్షిపణులను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయనున్నారు.

కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా.. రష్యా సహకారంతో మరింత శక్తివంతమైన ‘పాన్సిర్’ వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ ఆయుధాల సంయుక్త ఉత్పత్తికి కూడా అదానీ చర్చలు జరుపుతోంది. అలాగే ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేకే-203 రైఫిల్స్ విడిభాగాలతో పాటు దీర్ఘకాలిక మందుగుండు సామగ్రి సరఫరా కోసం ఇటీవలే కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌ఏఎల్, బీడీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అదానీ కూడా రష్యాతో డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుంటూ డిఫెన్స్ సెక్టార్ లో ప్రైవేట్ రంగానికి కొత్త దిశను నిర్దేశిస్తోంది.

భారత సైన్యం ఎదుర్కొంటున్న ఆధునీకరణ అవసరాలకు తగినట్లుగా అదానీ డిఫెన్స్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్లు, వైమానిక ముప్పును ఎదుర్కొనేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థ తక్కువ కాలంలోనే కీలకమైన రక్షణ ఒప్పందాలను దక్కించుకోవడం గమనార్హం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని రష్యా ప్రతిపాదనలపై సందిగ్ధత ఉన్నప్పటికీ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో అదానీ కీలక పాత్ర పోషిస్తోంది. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ఆయుధాల తయారీని దేశంలోనే చేపడుతూ అదానీ డిఫెన్స్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.