Reading Time: 2 minutes
Producer Pranay Reddy Vanga Challenge Critics Prabhas Spirit Movie

Pranay Reddy Vanga: సినిమా రివ్యూలు, నెగెటివ్ ట్రోలింగ్‌ల పేరుతో చిత్ర పరిశ్రమపై విషం కక్కే వారిపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘రోమాంచకం’ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తున్నప్పటికీ, కొందరు పనిగట్టుకుని చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేవలం రివ్యూలు రాసి బాక్సాఫీస్ వద్ద సినిమాల స్థాయిని ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేస్తూ.. రివ్యూవర్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోయే చిత్రం ‘స్పిరిట్’ను ఉద్దేశిస్తూ సవాల్ విసిరారు. ఒక సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం వెనుక వందలాది మంది అహర్నిశల శ్రమ దాగి ఉంటుందని ప్రణయ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో ఉండే వారికి మాత్రమే ఆ బాధలు, షూటింగ్ సమయంలో ఎదురయ్యే సవాళ్లు తెలుస్తాయని అన్నారు. “రైటర్ రాసుకున్న ప్రతి అక్షరాన్ని వెండితెరపై దృశ్యరూపంలోకి మార్చడానికి దర్శకుడు ఎంత క్షోభ అనుభవిస్తాడో బయట కూర్చునే వారికి అర్థం కాదు. ‘రోమాంచకం’ విషయంలో కొందరు విమర్శకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు అనవసర రాద్ధాంతం చేశారు. అలాంటి వారికి నిజంగా అంత సత్తా ఉంటే.. మా అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ స్థాయిని తగ్గించగలరా?” అంటూ నిప్పులు చెరిగారు.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రానున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఇప్పటికే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా క్యాస్టింగ్ చుట్టూ గతంలో నడిచిన హైడ్రామా టాలీవుడ్‌ను కుదిపేసింది. మొదట ఈ భారీ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొణెను ఎంపిక చేశారు. దాదాపు ఏడాదిన్నర పాటు సందీప్ వంగా ఆమెతో ప్రత్యేకంగా వర్క్ చేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆమె స్థానంలోకి ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీని తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దీపిక సినిమా కీలక కథాంశాన్ని బయటకు లీక్ చేసిందంటూ వచ్చిన ఆరోపణలు సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఎలాంటి నెగెటివిటీని అయినా ధ్వంసం చేసేలా సందీప్ వంగా మార్క్ రా కంటెంట్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కుతుందని సమాచారం. విమర్శకుల రివ్యూలతో ప్రభాస్ మేనియాను, సందీప్ టేకింగ్‌ను ఆపడం ఎవరి వల్లా కాదని నిర్మాత మాటలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చూడాలి.