Reading Time: 2 minutes
Off The Record Over Hindupuram Balakrishna

బాలయ్య ఇలాకాలో… మాస్‌ మసాలా డైలాగ్స్‌ పేలుతున్నాయా? హిందూపురం గడ్డ… మా అడ్డా అని టీడీపీ లీడర్స్‌ తొడలు కొడుతుంటే….వైసీపీ వాళ్ళు మాత్రం మోహన్‌ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారా? వార్‌ వన్‌సైడేనని అంటున్నది ఒకరైతే… మీరు తొక్కుతామంటే తొక్కించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని అంటోంది మరొకరు. స్థానిక ఎన్నికలు కేంద్రంగా… హిందూపురంలో నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఒకడు… నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్‌, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్‌, తొక్కిపడేస్తా….. అన్నది బాలయ్య పాపులర్‌ సినిమా డైలాగ్‌. ఆ రీల్‌ డైలాగ్స్‌ సంగతి ఎలా ఉన్నా…రియల్‌గా పాలిటిక్స్‌లో సైతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి దగ్గర దగ్గరగా అలాగే ఉందన్నది పొలిటికల్‌ వాయిస్‌. ఇక్కడ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ కొట్టారు నందమూరి బాలకృష్ణ. గెలిచిన ప్రతిసారి ఆయన మెజార్టీ పెరిగిందే తప్ప తగ్గలేదు. 2019ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ గాలి జోరుగా వీచి టీడీపీ డబుల్‌ డిజిట్‌ ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయినా… హిందూపురంలో బాలకృష్ణ మాత్రం అంతకు ముందుకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు స్థానిక ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తాగునీటితో పాటు మిగతా అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకంగా నిధులు తెస్తున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. మరోవైపు….గత మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని హిందూపురంలో బలం చూపించింది వైసీపీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాసరే… తగ్గకుండా… మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారట ఫ్యాన్‌ లీడర్స్‌. దాంతో… పొలిటికల్‌ సెగలు పెరిగిపోతున్నాయి. హిందూపురం మున్సిపాలిటీ వార్డుల సంఖ్యను 38 నుంచి 52కు పెంచడంతో… ఇప్పుడు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ పెరిగిపోతోంది. వార్డులు, ఛైర్మన్ రిజర్వేషన్స్‌ ఎలా ఉంటాయా అంటూ అన్ని పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు.

ఫైనల్‌ క్లారిటీ రాకున్నా… ఫలానా కోటాలో వస్తే ఫలానా నాయకుడు అంటూ… ప్రాధమికంగా ఫిక్స్‌ చేసుకుంటున్నారు. బాలకృష్ణ ఇమేజ్‌, పైగా అభివృద్ధి చేస్తున్నారన్న పేరు లాంటి కారణాలతో ప్రతిపక్షం మరింత అప్రమత్తం అవుతోందట. నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు ఇటీవల మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల్లో మన జెండా ఎగరాలని, మీ ముందు ఉంటామని లోకల్‌ కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టినా భయపడవద్దని, మీరు జైల్లో ఉన్నా సరే…. అసెంబ్లీ రౌడీ సినిమాలో లాగా జైలు నుంచే నామినేషన్లు వేసి గెలవాలంటూ పిలుపునిచ్చారు. సరిగ్గా ఇక్కడే సరికొత్త సందేహాలు వస్తున్నాయట రాజకీయవర్గాల్లో. కార్యకర్తల్లో ధైర్యం, నాయకుల్లో ఉత్సాహం నింపడానికి బ్రెయిన్‌ వాష్‌ ప్రోగ్రామ్‌ బాగానే పెట్టారుగానీ… అసలు గ్రౌండ్‌ రియాలిటీ ఏంటో మీకు తెలుస్తోందా? మన పార్టీలో ఏం జరుగుతోందో అర్ధమవుతోందా అంటూ సొంత వాళ్ళే లోకల్‌ వైసీపీ నేతల్ని అడుగుతున్నారట. హిందూపురంలో బాలకృష్ణ వరుసగా మూడు సార్లు గెలిచారంటే…. అందుకు టీడీపీ బలం ఒక ఎత్తయితే… అంతకు మించి వైసీపీ బలహీనతలే ప్రధానం కారణం అని అంటున్నారు. లోకల్‌ వైసీపీలో కీలకంగా ఉన్న నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి వారిని పార్టీ నుంచి పంపేసి…. పెద్ద పొరపాటు చేశారన్నది లోకల్‌ ఫ్యాన్‌ కేడర్‌లో బలంగా ఉన్న అభిప్రాయం. ఇన్ఛార్జ్‌ కురుబ దీపిక, నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డికి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నాయి. ముగ్గురూ ఈసారి ఎన్నికల్లో హిందూపురం టికెట్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కలిసి కాకుండా… ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. గతంలో అధిష్టానం నిర్ణయాలను వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్‌ బహిరంగంగా విమర్శించడమేగాక…దీపిక నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అందుకే వారిని పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ సైలెంట్ అయ్యారు. నాయకుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సెట్‌ చేయకుండా…బలమైన వాళ్లని సస్పెండ్ చేయడం వల్ల పార్టీ మరింత బలహీనపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే బలమైన ప్రత్యర్థి ఉన్న చోట….ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా… భారీ సినిమా డైలాగ్స్‌ చెబితే ఎన్నికల్లో గెలిచేస్తామా అని హిందూపురం వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.