Reading Time: 2 minutes

సూపర్ ఏఐతో మానవాళి అంతం .. ఈ దశాబ్దం చివరినాటికి విధ్వంసం తప్పదు

Caption of Image.
  • వ్యవస్థలన్నీ ఏఐ కంట్రోల్​లోకి..
  • ఏఐ రీసెర్చర్ జాకబ్ కాక్సన్ వార్నింగ్​
  • సూపర్ ఏఐ ఆవిష్కరణ కోసం ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ మధ్య పోటీ
  • మనుషుల జీవితాలతో జూదం ఆడుతున్నాయని విమర్శ 

 వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ను తక్కువగా అంచనా వేయొద్దని, మానవాళి మనుగడకు అది ముప్పుగా మారనుందని ప్రముఖ ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు. ఏఐ స్వయం నియంత్రణ సాధించడంతో పాటు అన్నింటినీ తన కంట్రోల్​లోకి తీసుకుంటుందని, ఈ దశాబ్దం చివరినాటికి మనుషుల ఉనికిని తుడిచిపెట్టేస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రెండు ప్రముఖ కంపెనీలు ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ మధ్య ప్రమాదకర పోటీ కొనసాగుతోందని ఆయన వివరించారు. 

సూపర్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణ కోసం ఈ రెండు కంపెనీలు పోటీపడుతున్నాయని చెప్పారు. దాంతో కలిగే దుష్పరిణామాలపై పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ అవి వెనుకడుగు వేయడంలేదని, ఎవరికి వారు తామే ముందు సూపర్ ఇంటెలిజెన్స్​ రూపకల్పనకు కృషి చేస్తున్నారని జాకబ్ వివరించారు. రెండింట్లో ఏ కంపెనీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని ఆరోపించారు. మనుషుల జీవితాలతో అవి జూదం ఆడుతున్నాయని మండిపడ్డారు. 

ఆయా కంపెనీల ఉద్యోగులు బహిరంగంగా దీనిపై మాట్లాడకపోయినా  ప్రైవేటు సంభాషణలలో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాను కూడా గడిచిన మూడేళ్లుగా ఆంథ్రోపిక్ లో పరిశోధకుడిగా పనిచేస్తున్నానని, ఈ విషయం అర్థం కావడంతో రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు. ఈమేరకు జాకబ్ ఎక్స్ వేదికగా ఈ సంచలన విషయాలను వెల్లడించారు.

ఒక్క రోజులో అన్నీ మారిపోతయ్..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధతో ముప్పులేదని, దానిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దే క్రమంలోనే ముప్పు పొంచి ఉందని జాకబ్ వివరించారు. ఈ టెక్నాలజీని తక్కువగా అంచనా వేయకూడదని, త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న సూపర్ హ్యూమన్ సిస్టంతో ఒకే ఒక్క రోజులో అన్నీ మారిపోతాయని హెచ్చరించారు. సూపర్ ఏఐ అన్నింటినీ హ్యాక్ చేస్తుందని, రాత్రికి రాత్రే విప్లవాత్మకమైన మార్పులు చేసి అన్ని వ్యవస్థలను, 
వనరులను తన అధీనంలోకి తెచ్చుకుంటుందని తెలిపారు. ఇదంతా వేగంగా జరిగిపోతోందని, ఏఐ కంపెనీల రేసు ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరినాటికి విధ్వంసం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. 

జాకబ్ చెప్పింది నిజమే..: హుబింగర్ (ఆంథ్రోపిక్)

జాకబ్ ఆరోపణలపై ఆంథ్రోపిక్ అలైన్ మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హుబింగర్ స్పందించారు. ‘జాకబ్ చెప్పింది నిజమే. మొత్తం మానవాళిని ఏఐ నాశనం చేయగలదని మేం నమ్ముతున్నాము. అయితే, రాబోయే పదేళ్లలో ఈ ముప్పు సుమారు 10 శాతానికి పైగా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆంథ్రోపిక్ ఈ ముప్పును తప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. కానీ, సూపర్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ కోసం అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను పరిష్కరించడానికి మా వద్ద ఇప్పటి వరకు ఎటువంటి ప్రణాళిక లేదు’ అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మోడల్స్ వల్ల ముప్పు తక్కువేనని భావిస్తున్నట్లు చెప్పారు. రికర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి ఉద్భవించే సూపర్‌‌‌‌‌‌‌‌ఇంటెలిజెన్స్ ఊహకందని వేగంతో డెవలప్ అవుతోందని హుబింగర్ పేర్కొన్నారు.  

ఆంథ్రోపిక్ విషయంలో పొరపడ్డా..: మస్క్​

ఒకప్పుడు ఆంథ్రోపిక్​ను పాశ్చాత్య నాగరికతకు పెను ప్రమాదంగా అభివర్ణించిన ఎలాన్ మస్క్.. ఇటీవలి కాలంలో మాటమార్చారు. ఆంథ్రోపిక్ విషయంలో తాను పొరపడ్డానని, ఏఐ రంగంలో ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉందని అన్నారు. మైథోస్ లాంటి గొప్ప మోడల్​ను రూపొందించడం కేవలం ఆంథ్రోపిక్​కు మాత్రమే సాధ్యమని, త్వరలోనే దాని అప్​డేటెడ్ వెర్షన్ మైథోస్ 2 ను మార్కెట్లోకి తీసుకొస్తారని భావిస్తున్నట్లు మస్క్ చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.