Reading Time: 2 minutes
Otr Ntv Telugu Telangana Politics Congress Brs

OTR:  చిట్టా విప్పుదాం…. మాటలతో చెప్తే అర్ధం కానప్పుడు పేపర్‌తో కొడితేనే కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది. అందుకే వివరాలన్నీ బయట పెట్టేద్దామని భావిస్తున్నారట తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. అలా చేస్తేనే విపక్షానికి గట్టి కౌంటర్‌ ఇచ్చినట్టు అవుతుందని అధికార పార్టీ లెక్కలేస్తోందంటున్నారు. ఇంతకీ… బయట పెట్టాలనుకుంటున్న ఆ చిట్టా ఏంటి? ఏ విషయంలో బీఆర్‌ఎస్‌కు అంత స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులకు భూ కేటాయింపులు అంటూ వస్తున్న ఆరోపణలు పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతున్నాయి. వాళ్ళకు అప్పనంగా భూములు కట్టబెట్టారని, అర్హతలు ఏంటంటూ ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్‌. దాని మీద లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన భూమిని ఏడు కోట్లకే అప్పగించారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది ప్రతిపక్షం. ఈ అంశం కేంద్రంగా రాజకీయ ఆరోపణలు … ఫిర్యాదుల పర్వాన్ని ఎంచుకుంది BRS. ఈ విషయంలో ఇంకా ముందుకే వెళ్ళే ప్రయత్నంలో విపక్షం ఉండగా… అధికార పార్టీ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. భూ కేటాయింపుల్లో రేవంత్ సర్కార్…అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌.

అదే సమయంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో జరిపిన భూ కేటాయింపులు, ఎంపిక చేసిన ధరల వివరాలతో సహా అన్నిటినీ బయటపెట్టాలని యోచిస్తోందట ప్రభుత్వం. అప్పుడున్న ధరలు, నాడు ఎవరెవరికి ఎంత కారు చవగ్గా ఎన్ని ఎకరాలు కట్టబెట్టారంటూ పూర్తి వివరాలు బయటపెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. సీఎం సోదరుల విషయంలో బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పటికే ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో ఆ పదేళ్లలో జరిగిన భూముల కేటాయిపులు… ఎవరికి ఎన్ని ఎకరాలు ధారాదత్తం చేశారు అనే వివరాలు బయట పెడతామని కూడా అన్నారాయన. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తు జరుగుతోందన్నది ఇంటర్నల్‌ టాక్‌. ముఖ్యమంత్రి సోదరుల పేరుతో అసలు కంపెనీయే లేదు…అలాంటప్పుడు వాళ్ళకు భూకేటాయింపు ఏంటని ప్రశ్నించారు మంత్రి. అయినా… భూముల ధరలు కమిటీ నిర్ణయిస్తుందని అన్నారాయన. పైగా… ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న ఏరియాలో నాటి ధర ఎకరాకు 90 లక్షలు ఐతే.. ఇప్పుడు తమ ప్రభుత్వం కోటి 50 లక్షలకు పెంచినట్టు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో… అప్పట్లో తక్కువ ధరకు భూములు ఎవరెవరికి ఇచ్చారు..? అందులో నాటి ప్రభుత్వ పెద్దల సన్నిహితులు ఎవరు..! ఎన్ని ఎకరాలు ఎంతకు అప్పగించారు అనే పూర్తి లెక్కలు తీయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పుడు అత్యంత పారదర్శకంగా ధరలు పెంచి భూములు కేటాయిస్తుంటే… బీఆర్‌ఎస్‌ మాత్రం ఉత్తుత్తి ఆరోపణలతో పరిశ్రమలు రాకుండా అడ్డుకునే పనిలో ఉన్నట్టు భావిస్తోందట అధికార పక్షం. గతంలో హిల్ట్ పాలసీపై కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది ప్రతిపక్షం. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరాకటంలోకి నెట్టి… రాజకీయం చేయాలని ఆ పార్టీ చూస్తోంది కాబట్టి… వాళ్ళకు వాళ్ళ స్టైల్‌లోనే కౌంటర్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే…నాడు జరిగిన కేటాయింపుల వివరాలు బయటపెట్టి… తక్కువ ధరకు భూములు ఇచ్చిన వాళ్ళతో లాలూచీ పడినట్టేనా..? అంటూ ప్రశ్నించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న భావనతో ఆ పదేళ్ల భూ కేటాయింపులు… భూములు పొందిన కంపెనీల చిట్టా మొత్తం బయట పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో… ఆ లిస్ట్‌ ఎప్పుడు బయట పెడతారు..? అందులో ఎవరెవరి కంపెనీలు ఉన్నాయి…అంటూ రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అయితే… ఇదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. లెక్కలు తేల్చుతామని ఇప్పుడు గొప్పగా చెబుతున్నారుగానీ… రేపు తీరా ఆ టైం వచ్చినప్పుడు కంపెనీలకు ఇబ్బంది, పెట్టుబడులకు ప్రమాదం అంటూ వివరాలు ఇవ్వకుండా దాటవేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? మాటలకే పరిమితం అవుతుందా? లేక చిట్టా విప్పుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.