Reading Time: 2 minutes

Faria Abdullah: గుక్కపెట్టి ఏడ్చిన ఫరియా.. తప్పు మార్గంలో ఉన్నారంటూ ట్రోలర్లకు దిమ్మతిరిగే కౌంటర్.!

Caption of Image.

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొత్తేమీ కాదు. అయితే ఒక్కోసారి ఆ విమర్శలు హద్దులు దాటితే వారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. లేటెస్ట్ గా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా విషయంలోనూ అదే జరిగింది. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను కొందరు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారని చెబుతూ ఫరియా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా .. 

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా ఉత్సాహంగా పాల్గొంది. బోనం ఎత్తుకుని మహిళలతో కలిసి ఊరేగింపులో సందడి చేసింది… పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేస్తూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించింది. అయితే ఈ వీడియోలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆమెపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. తనను ‘కాఫిర్’ అంటూ విమర్శించడంపై ఫరియా తీవ్రంగా భావోద్వేగానికి గురైంది.

తప్పు మార్గంలో ఉన్నట్లే.. 

ఈ దారుణమైన విమర్శలపై స్పందిస్తూ ఫరియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో తన గుండెల్లోని బాధనంతా వెళ్లగక్కుతూ గుక్కపెట్టి ఏడ్చేసింది. మా నాన్న ఇస్లాం మతాన్ని ఇష్టపడి స్వీకరించారు. ఇస్లాంలో ఉన్న మంచిని నాకు నేర్పిస్తూ పెంచారు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడటమే అసలైన భక్తి. ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే మీరు తప్పు మార్గంలో ఉన్నట్లే అంటూ కన్నీళ్లతో ప్రశ్నించింది.

మరింత ప్రేమని పంచుతా..

అల్లా అంటే ప్రతిచోటా విస్తరించి ఉండే ఒక దివ్యమైన వెలుగు. అంతటి విశాలమైన మతాన్ని మీ సంకుచిత ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారు?అని ఫరియా నిలదీసింది.  తప్పు పడుతున్న వారికి కూడా మంచి జరగాలని, తనపై ద్వేషం చిమ్మే వారికి మరింత ప్రేమని పంచుతానని స్పష్టం చేసింది. లౌకిక భావాలతో పండుగల్లో పాల్గొన్న తన మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంపై తీవ్రంగా కలత చెందుతూ ఎమోషనల్ అయింది. 

 

ఈ వీడియో చూసిన నెటిజన్లు, చిత్రపరిశ్రమ ప్రముఖులు ఫరియాకు మద్దతుగా నిలుస్తున్నారు. మతాల హద్దులు చెరిపేసి సంస్కృతిని గౌరవించడాన్ని తప్పుపట్టడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు. నాటకం, డ్యాన్స్, నటనలో తనదైన ముద్ర వేసిన ఫరియా.. ప్రస్తుతం త్వరలో విడుదల కానున్న ‘సిగ్మా’ చిత్రంతో పాటు పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ద్వేషం కన్నా ప్రేమే గొప్పదని చాటిచెప్పిన ఆమె ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.