Reading Time: < 1 minute
Faria Abdullah Emotional Video Bonalu Islam Comments

Faria Abdullah: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె బోరున ఏడుస్తూ తన వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం, మతంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన తండ్రి ఇస్లాంపై ఉన్న నమ్మకంతో ఆ మతంలోకి మారారని తెలిపారు. తన తండ్రి విశ్వాసాలను తాను గౌరవిస్తానని చెప్పారు. అంతేకాదు.. తాను కూడా ఇస్లాం గురించి మంచి విషయాలను మాత్రమే చెబుతుంటానని పేర్కొన్నారు. మతం విషయంలో మనుషుల మధ్య విభేదాలు కాకుండా ప్రేమ, మానవత్వం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన ఓ మాటను గుర్తు చేసుకున్న ఫరియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “అల్లా అన్నింటా ఉంటారు” అని తన తల్లి చెప్పేవారని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో తల్లిదండ్రులు నేర్పిన విలువలు ఎంతో ముఖ్యమైనవని ఆమె వెల్లడించారు. తనను విమర్శించే, ద్వేషించే వ్యక్తుల గురించి కూడా ఫరియా ఆసక్తికరంగా స్పందించారు. తనను ద్వేషించే వారిని సైతం తాను ప్రేమిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలని, వ్యక్తిగత విశ్వాసాలను బట్టి మనుషులను తీర్పు ఇవ్వకూడదనే భావనను ఆమె వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె పాల్గొన్న తీరుపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబం, మత విశ్వాసాలు, తన ఆలోచనల గురించి ఫరియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫరియా అబ్దుల్లా చేసిన తాజా కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.