Reading Time: 2 minutes

మీకు తెలుసా:అప్పట్లో మన రూపాయికి 8 కిలోల బియ్యం, గ్రాము బంగారం వచ్చేవి..!

Caption of Image.

స్వాతంత్ర్యం వచ్చి80 ఏళ్లు అయిన సందర్భంగా ఇప్పుడు మనం రూపాయి కథ చెప్పుకుందాం.. ఒకప్పుడు అంటే 1947 కు ముందు నాటి పరిస్థితులలో జేబులో ఉన్న ఒక రూపాయి ఉంటే అది చిన్న మొత్తం కాదు.. కుటుంబానికి కావాల్సిన సరుకుల్లో కొంత భాగం కొనిపెట్టేంత విలువ ఉండేది. అప్పట్లో ఒక రూపాయితో దాదాపు 8 కిలోల బియ్యం, 8 లీటర్ల పాలు, 3.7 లీటర్ల పెట్రోల్ కొనగలిగేవారు. నిత్యావసరాలే కాదు.. బంగారం కూడా చీపే..ఒక రూపాయికి 100 మిల్లీగ్రాములకు పైగా వచ్చేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ 79 ఏళ్ల తర్వాత అదే రూపాయి విలువ దాదాపు కనుమరుగైంది. ఇప్పుడు రూపాయితో కొన్ని గ్రాముల బియ్యం కూడా కష్టమే. మరి అప్పటి రూపాయికి అంత విలువ ఎలా ఉండేది? ఈ 79 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, ధరలు, ప్రజల ఆదాయాలు ఎలా మారాయో తెలుసుకుందాం..

ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే..1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక రూపాయితో చాలా ఎక్కువ సరుకులు కొనగలిగేవారు. అయితే అప్పటి వేతనాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. దేశంలో ఆహార కొరత, రేషనింగ్ ఉండేది. ప్రాంతాలను బట్టి ధరల్లో తేడాలు కూడా ఉండేవి. 1947తో -2026 ధరల పోలికను ఖచ్చితమైన లెక్కగా కాకుండా ఒక అంచనాగా చూడాలి.

1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి కిలో బియ్యం ధర సుమారు 12 పైసలు. అంటే రూ.1తో దాదాపు 8.3 కిలోల బియ్యం కొనవచ్చు. లీటర్ పాల ధర కూడా సుమారు 12 పైసలే. దీంతో రూ.1తో 8.3 లీటర్ల పాలు వచ్చేవి. లీటర్ పెట్రోల్ సుమారు 27 పైసలు ఉండటంతో రూ.1తో 3.7 లీటర్ల పెట్రోల్ కొనగలిగేవారు.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2026 ఆగస్టులో దేశవ్యాప్తంగా బియ్యం సగటు ధర కిలోకు సుమారు రూ.33. అంటే రూ.1తో కేవలం 30 గ్రాముల బియ్యం మాత్రమే కొనగలం. హైదరాబాద్ లో  పెట్రోల్ లీటర్ సుమారు రూ.115 ఉండటంతో రూ.1తో 11.5 మిల్లీలీటర్లలోపే పెట్రోల్ వస్తుంది. ప్యాకెట్ ఫుల్‌క్రీమ్ పాలు లీటర్ సుమారు రూ.45 అంటే రూ.1తో కేవలం 10.5 మిల్లీలీటర్ల పాలు మాత్రమే కొనగలం. 

బంగారం విషయంలో తేడా అప్పటికీ ఇప్పటికీ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 1947లో 10 గ్రాముల బంగారం సుమారు రూ.88. అంటే రూ.1తో దాదాపు 0.11 గ్రాముల బంగారం వచ్చేది. 2026 ఆగస్టు 15న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సుమారు రూ.1.48 లక్షలు. ఇప్పుడు రూ.1తో కేవలం 0.067 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే వస్తుంది.

అయితే దీనిని కేవలం ద్రవ్యోల్బణంగా చూడకూడదు. 1947లో ఆదాయాలు, ఉత్పత్తి, సాంకేతికత, రవాణా, సేవలు చాలా పరిమితంగా ఉండేవి. ఈరోజు ధరలు పెరిగినా ఆదాయాలు, ఉత్పత్తి, సాంకేతికత, జీవన ప్రమాణాలు కూడా భారీగా మారాయి.

అంటే ఒక రూపాయి కథ.. ధరలు పెరిగిన కథ మాత్రమే కాదు.. 79 ఏళ్లలో భారత్ ఎంతగా మారిపోయిందో చెప్పే కథ కూడా.

©️ VIL Media Pvt Ltd.