
India vs Afghanistan 2nd ODI: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు ( జూన్ 17న, బుధవారం) జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 170 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే శుభ్‌మన్ గిల్ ట్రోఫీని కైవసం చేసుకుని తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 402 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అవ్వగా.. అనంతరం చేజింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ 232 పరుగులకే చేతులెత్తేసింది.
కెప్టెన్ గిల్, ఇషాన్ విధ్వంసం:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ విఫలమైన, రోహిత్ శర్మ మాత్రం హాఫ్ సెంచరీకి చేరువైన తర్వాత పెవిలియన్ చేరాడు. గిల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగి కేవలం 110 బంతుల్లోనే 154 పరుగులు బాదాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ వన్డే మ్యాచ్‌ని కాస్తా టీ20లా మార్చేస్తూ కేవలం 79 బంతుల్లోనే 125 రన్స్ కొట్టి ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశాడు. వీరిద్దరూ కలిసి కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా 402 పరుగుల స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశారు.
అర్ష్‌దీప్, గుర్నూర్ బ్రార్ మ్యాజిక్:
403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు అస్సలు అవకాశం ఇవ్వలేదు. పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడిన అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు చెరో 3 వికెట్లతో ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ప్రిన్స్ యాదవ్ రహ్మత్ షాను అవుట్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 232 రన్స్ వద్ద ముగిసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లతో రాణించడం విశేషం.
►ALSO READ | పెర్రీ క్లాస్.. వోల్ మాస్.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల ఘన విజయం
గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం!
ఈ అద్భుత విజయంతో శుభ్‌మన్ గిల్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా తన మొదటి సిరీస్ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, జట్టును ముందుండి నడిపించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సిరీస్ ఇప్పటికే భారత్ వశం కావడంతో, ఇక చెన్నై వేదికగా జరగబోయే చివరి వన్డే కేవలం ఫార్మాలిటీగా మారింది.