
Bitcoin Hits New Record: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మళ్లీ పుంజుకుంది. మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా బిట్‌కాయిన్ ధర 80 వేల డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. సోమవారం ఉదయం సింగపూర్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 1.9 శాతం వృద్ధి చెంది 80,393 డాలర్లకు చేరుకుంది. జనవరి 31 తర్వాత బిట్‌కాయిన్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
క్రిప్టో మార్కెట్‌లో జోరుకు కారణాలివే..
యూఎస్ బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) లోకి శుక్రవారం ఒక్కరోజే సుమారు 630 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్టేబుల్‌కాయిన్ ఈల్డ్ నిబంధనలపై అమెరికా సెనేట్‌లో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపాయి. గత 24 గంటల్లో సుమారు 280 మిలియన్ డాలర్ల విలువైన షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి, ఇది ధర మరింత పెరగడానికి దోహదపడింది. ఇదే సమయంలో బిట్‌కాయిన్‌తో పాటు ఇతర టోకెన్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఎథెరియం 2,380 డాలర్ల పైన, ఎక్స్‌ఆర్‌పి (XRP) 1.40 డాలర్ల వద్ద, సొలానా 85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాష్, జెడ్‌క్యాష్ వంటివి టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మాత్రం క్రిప్టో మార్కెట్ తీరును ‘జూదం’గా అభివర్ణిస్తూ, తక్కువ కాలంలో లాభాల కోసం చూసే రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు.
దేశీయ మార్కెట్లలో ఎన్నికల జోష్..
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఎన్నికల ఫలితాల ప్రభావంతో భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 616 పాయింట్లు లాభపడి 77,529 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 24,178 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ల సంపద (బిఎస్ఈ మార్కెట్ క్యాప్) కేవలం ఒక్క సెషన్‌లోనే రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరుకుంది. ఆటో, రియాల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు బ్యాంకింగ్ రంగాలు మార్కెట్లకు ఊతాన్నిస్తున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వివాదం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.