
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు దారులకు మరోసారి మూడు నెలలకు ఒకేసారి బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఇవాళ్టి(ఆగస్టు1)నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ జరుగుతుందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డులపై 3.41 కోట్ల మంది లబ్దిదారులు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలో 1560 రేషన్ షాపుల ద్వారా శనివారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ కీలకమైనందున డీలర్లు ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్జిల్లాలో ఉన్న 653 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు 59,602.822 టన్నుల బియ్యం, అలాగే 7,279.513 టన్నుల గోధుమలు పంపిణీ చేయనున్నట్టు సీఆర్ఓ రాజిరెడ్డి తెలిపారు. బియ్యం ఉచితంగా ఇస్తామని, గోధుమలు కిలోకు రూ.7 చొప్పున చెల్లించాలన్నారు.
ఈ–కేవైసీ గడువు పెంపు
భారీ వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించారు. ఎవరైనా నేరుగా తమ దగ్గరలోని రేషన్‌షాపునకు వెళ్లి బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు ఇవ్వడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
బయోమెట్రిక్ ఒకేసారి అయితే బెటర్
మూడు నెలల బియ్యం పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్‌ను ఒకేసారి తీసుకునేలా అనుమతించాలని రేషన్ డీలర్లు అధికారులను కోరుతున్నారు. 3 నెలలకు సంబంధించి మూడు సార్లు వేలి ముద్రలు తీసుకోవాలంటే చాలా సమయం పడుతోందని, దీంతో షాపుల ముందు రద్దీ పెరిగి బియ్యం పంపిణీకి ఇబ్బంది కలుగుతోందని డీలర్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.