
స్టేషన్ ఘనపూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ అలాట్‌మెంట్ కాపీని కడియం శ్రీహరికి అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిగ్రీ కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
కళాశాల నిర్మాణానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఆయన, త్వరలోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాల సొంత భవనంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.