Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. ఈ నెలలో కూడా పంపిణీ నిలిపివేత.. ఇక లేనట్లేనా..?

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరోసారి కూటమి సర్కార్ బ్యాడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 1 నుంచి 15 తేదీ వరకు పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. నెలలలో తొలి 15 రోజులు దుకాణాల ద్వారా డీలర్లు రేషన్ కార్డు ఉన్నవారికి సరుకులు అందిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వీటితో పాటు రాగులు, జొన్నలు, గోధుమ పిండి అందిస్తున్నారు. అయితే ఈ నెల కూడా కందిపప్పు అందించడం లేదు. స్టాక్ లేకపోవడంతో వీటి పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో సామాన్యులకు ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు.

నిలిచిపోయిన కందిపప్పు పంపిణీ

బయట మార్కెట్లో కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్ షాపీల్లో సబ్సిడీలో తక్కువ ధరకే పొందవచ్చు. అయితే గతంలో కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ నెల పూర్తిగా నిలిపివేసింది. స్టాక్ లేకపోవడం, టెండర్ల విషయంలో ఆలస్యం జరగడం కందిపప్పు రేషన్ దుకాణాలకు రావడం లేదు. ఈ నెల అయినా అందుబాటులోకి వస్తుందని పేదలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నెల కూడా రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వచ్చే నెలలో అయినా అందుబాటులోక తీసుకురావాలని కోరుతున్నారు. టెండర్ల విషయంలో ఆలస్యం జరగడం వల్ల పంపిణీ చేయలేకపోతున్నామని, వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు తక్కువ ధరకు పంపిణీ చేశారు. అయితే ఆ తర్వాత వీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం కొత్త సంస్కరణలు

ఏపీ ప్రభుత్వం బియ్యం, పంచదారతో పాటు గోధుములు, జొన్నలు, రాగులు, పామాయిల్, కందిపప్పు రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు అందించాలని చూస్తోంది. ఇప్పటికే రాగులు, జొన్నలు, గోధుమలు అందిస్తుండగా.. కందిపప్పు పంపిణీ జరగడం లేదు. దీంతో వీలైనంత త్వరగా వీటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే నెలలో తొలి 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డీలర్లు రేషన్ అందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఇంటికే డోర్ డెలివరీ చేస్తోంది. ఇక రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త ఈపోస్ యంత్రాలను తీసుకొచ్చారు. అలాగే కొత్త స్మార్ట్ కార్డులను కూడా లబ్దిదారులకు అందించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్దిదారులందరికీ ఉచితంగా క్యూఆర్ కోెడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.  ఇలా రేషన్ సరఫరాలో అనేక మార్పులు తీసుకొచ్చారు.